Thursday, October 25, 2007

మొయిలీకి వీర తెలంగాణ దెబ్బ చూపిస్తం కేసీఆర్‌ Eenadu

నిర్మల్‌, న్యూస్‌టుడే: 'కాంగ్రెస్‌ తన బండారాన్ని తానే బయటపెట్టుకుంది. తెలంగాణ ద్రోహులమని వారే చెప్పుకొంటున్నారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటుచేస్తున్నట్లు నమ్మక ద్రోహపు మాటలు మాట్లాడిన వీరప్ప మొయిలీ.. నీకు వీర తెలంగాణ దెబ్బ చూయిస్తం'.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో 'ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాచైతన్య సదస్సు' పేరిట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం యావత్తూ కాంగ్రెస్‌, తెదేపాను దుయ్యబట్టారు. ప్రసంగపాఠం ఆయన మాటల్లోనే..
'50 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నరు. నెహ్రూ చెప్పినట్లు భార్యాభర్తల్లా విడిపోదామంటే కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది. కాంగ్రెస్‌, తెదేపా రెండూ తెలంగాణను నాశనం చేశాయి. వైఎస్‌ఆర్‌ పాలన స్వర్ణయుగమంటూ మొయిలీ కితాబిచ్చిండు. ఏది స్వర్ణయుగం? దుబాయ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు జ్వరాలతో పిట్టల్లా రాలుతున్నరు. 2004 ఎన్నికల్లో నమ్మినం. నమ్మక ద్రోహం చేసిండ్రని వారే చెప్పుకొంటున్నరు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆధునీకరించి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్నారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తేలేదు. 22 ఏళ్ళుగా ఊసులేని మందాకినీ కాలువ ఏమైంది? ఉచిత కరెంట్‌, రూ. 2కే కిలో బియ్యం.. వీటికి మోసపోతే.. భవిష్యత్తులో గోసపడతాం. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను భూస్థాపితం చేద్దం' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉత్తర కరోలినాలో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు Andhra Jyothy

రలీగ్‌, అక్టోబర్‌ 25: దసరా, బతుకమ్మ పండుగలను నార్త్‌ కరోలినా ప్రవాస తెలుగువారు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్బ్‌ట్రీ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు రలీగ్‌, డుర్హమ్‌, కారీ ప్రాంతాల నుంచి వ ందల సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం మొదలయిన వేడుకలు సూర్యాస్తమయంలోపు ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగువారు పండుగలతో తమకున్న తియ్యటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
మన సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని కడారు శ్రీలక్ష్మి, రామ్‌ప్రసాద్‌ అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన డం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తానుగా బతుకమ్మ తయారుచేయడానికి తమ కుమార్తె యుక్తి శ్రీని ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. బతుకమ్మ పేరు వింటేనే తాను పులకించిపోతానని మంచినేని రూప అన్నారు.

తమ చిన్నతనంలో బతుకమ్మ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించుకునే వారమని, తమ ఇంటిలోనే కాకుండా పొరుగు ఇళ్ళకు కూడా వెళ్ళి బతుకమ్మలను అలంకరించడం మర్చిపోలేమని జలగం లతా నితిన్‌, శుంకు జ్యోతి రవీందర్‌ చెప్పారు. బతుకమ్మ గురించి చెప్పే కథలు ఆశక్తికరంగా వినేవారమని పొదిల సంధ్యా లక్షీనారాయణ అన్నారు. తమ సోదరీమణులు, వారిపిల్లలు అంతా ఒక చోటికి చేరుకుని బతుకమ్మను ఘనంగా నిర్వహించుకునే వారమన్నారు. ఆప్యాయతానుబంధాలు తమ మధ్య వెల్లివిరిస్తుండేవని తెలిపారు. కొత్తబట్టలు ధరించి ఆ తొమ్మిది రోజులూ ఉత్సాహంగా ఉండేవారమని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దివ్యశ్రీ వేమారెడ్డి దంపతులు, గోపి, స్వాతి బిరిచెట్టి, రాము, నరేందర్‌, విస్సు శ్రీధర్‌ తదితరులు వేడుకలో నవ్వులు పూయించారు. తెలంగాణా అభివృద్ది సంఘం , ట్రైయాంగిల్‌ ఎన్‌ఆర్‌ఐ తెలుగు అసోసియేషన్‌ తరపున ఆహూతులకు పొదిల లక్షీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రవాసులేకాక రాయలసీయ, కోస్తాంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రవాస భారతీయులు ఈ వేడుక ల్లో పాలుపంచుకున్నారు. కడారు రామ్‌ప్రసాద్‌ వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.




తెలంగాణపై ఆచి తూచి... Andhra Jyothi

మెయిలీని నిలదీయలేకపోయిన కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (ఆన్‌లైన్‌): రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ప్రకటించి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆశలపై నీళ్లు చల్లారు. గతంలో ఇదే విధంగా వ్యాఖ్యానించిన దిగ్విజయ్‌సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్‌సీసీ నేతలు ఆ స్థాయిలో మొయిలీపై విరుచుకు పడలేకపోయారు. ఆచితూచి మాట్లాడారు. సిద్ధిపేట ఎంపీ సర్వే సత్యనారాయణ ఒక్కరే కాస్త గట్టి స్పందించారు. రెండో ఎస్సార్సీ వేయడం కంటే తెలంగాణ ఇవ్వలేమని చెప్పడమే సమంజసమని ప్ర జలు భావించే అవకాశాలున్నాయని అన్నారు. మొదటి ఎస్సార్సీ వే సేందుకు 23 నెలలు పట్టిందని, రెండో ఎస్సార్సీ వేసేందుకు మరో మూడు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. దీనిని ప్రజలు వి శ్వసించరని అభిప్రాయపడ్డారు.
సీఎల్పీ సమావేశం తర్వాత పలువురు నేతలు విలేకరులతో ఇలా పేర్కొన్నారు. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పా టును నేతలే కోరుకుంటున్నారా.... ప్రజలే కావాలంటున్నారా తెలి యాలంటే ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. రెండో ఎస్సార్సీనో... ప్రత్యేక కమిషనో ఏదో ఒకటి వేయాల్సిన అవసరమైతే ఉంది' అని కాంగ్రెస్‌ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. 'తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు తప్ప ప్రత్యేక పీసీసీ కాదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రత్యేక తెలంగాణ అంశం 2009 ఎన్నికల్లోగా తేల్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం అయితేనే రెండో ఎస్సార్సీ ఆమోదయోగ్యమన్నారు.