Thursday, July 12, 2007

పీజేఆర్‌కు ఢిల్లీ పిలుపు! eenadu

రేపు మాట్లాడదాం
మేడంతోనూ చర్చిద్దాం
రాజకీయం చేయొద్దని దిగ్విజయ్‌ హితవు
రాష్ట్రంలో వీహెచ్‌ రాజీ యత్నాలు
రెండు కుటుంబాలతోనూ భేటీ
సీఎంతో చర్చ
న్యాయం జరక్కుంటే దీక్ష తప్పదు: పీజేఆర్‌
హైదరాబాద్‌, న్యూఢిల్లీ -న్యూస్‌టుడే
పీజేఆర్‌ ఆమరణ దీక్ష హెచ్చరిక ప్రకంపనలు సృష్టించింది. అధిష్ఠానాన్నీ కదిలించింది. అటు దిగ్విజయ్‌.. ఇటు వీహెచ్‌ రంగంలోకి దిగారు. అధికారికంగా రాజీ యత్నాలు షురూ చేశారు. చర్చల కోసం ఢిల్లీ రావాలని దిగ్విజయ్‌ ఆహ్వానించారు. మేడమ్‌తోనూ మాట్లాడుదురు గాని అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముంగిట ఇబ్బందికర పరిస్థితిని నివారించే లక్ష్యంతో సాగిన ఈ రాజీ యత్నాలు.. పీజేఆర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆయనే మాత్రం రాజీ పడకపోగా... వైఎస్‌ ప్రభుత్వంపై దాడిని మరింత ఉద్ధృతం చేశారు. మరోసారి సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమరణ దీక్షపై వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. వైఎస్‌ సోదరుడూ ఘాటుగానే స్పందించారు. దెబ్బలు తిని కూడా బతికి ఉన్నందుకే తమపై హత్యాయత్నం కేసు పెట్టాలా అంటూ మండిపడ్డారు. దిగజారుడు డిమాండ్లొద్దని పీజేఆర్‌కు హితవు పలికారు.

ఇప్పటిదాకా దాన్నో చిన్నసమస్యగా అభివర్ణించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం గురువారం నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌, సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి కుటుంబాల మధ్య రేగిన చిచ్చు పార్టీకి నష్టం కలిగించనుందని గ్రహించి.. దానికి సత్వరం ముగింపు పలకాలని నిర్ణయించింది. ముఖ్యంగా తన డిమాండ్లను నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని పీజేఆర్‌ హెచ్చరించడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటుతోందని అది గ్రహించింది. అదీగాక అసెంబ్లీ సమావేశాలు 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ వివాదాన్ని ప్రతిపక్షాలు హైజాక్‌చేసే ఆస్కారముందనీ ఆందోళన చెందింది. అదుకే హుటాహుటిన నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ గురువారం పీజేఆర్‌తో ఫోనులో మాట్లాడారు. రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజకీయం చేయొద్దని ఆయనకు సూచించారు. శనివారంనాడు (14న) ఢిల్లీకొస్తే.. నేరుగా చర్చిద్దామని దిగ్విజయ్‌ సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాతో కూడా మాట్లాడదామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
రవీంద్ర సౌమ్యుడు:పీజేఆర్‌తో చర్చించిన తర్వాత దిగ్విజయ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి సౌమ్యుడని ఆయన కితాబిచ్చారు. రవీంద్ర ముఖ్యమంత్రికి సోదరుడన్న సంగతి ఆయన నివసించే ప్రాంతంలో చాలా మందికి తెలియదని.. దాన్నిబట్టే ఆయనెలాంటి వ్యక్తో తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తిపై చిన్న విషయం గురించి దాడిచేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్‌, పీసీసీ అధ్యక్షుడు కేకే, పీజేఆర్‌లతోసహా హైదరాబాద్‌లోని పలువురు పార్టీ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు తమంతట తామే కేసులు నమోదు చేశారని, నిష్పాక్షికంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 307 సెక్షన్‌ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయడంపై పీజేఆర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. వైద్య పరీక్షల నివేదికలు పరిశీలించి, గాయాలు తీవ్రమైనవి కాకుంటే శిక్ష తగ్గుతుందని వివరించారు.

వైఎస్‌ జోక్యం అవసరంలేదు: ఈ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని లేదని దిగ్విజయ్‌ స్పష్టంచేశారు. వీధి గొడవను రాజకీయ అంశంగా మార్చవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన మీడియాను తప్పుపట్టారు. రవీంద్రనాథ్‌కు పీజేఆర్‌ క్షమాణలు చెప్పారని తెలిపారు. ఈ వివాదంలో పలువురు ఎమ్మెల్యేలు పీజేఆర్‌ను సమర్థించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు కాదా అని అడగ్గా.. రాష్ట్రం నుంచి పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తెలంగాణ అంశంగా ఎలా మారుతుందంటూ ఎద్దేవా చేశారు.

నేనుంటే ఇలా జరిగేది కాదు: ఇటు హైదరాబాద్‌లో సీనియర్‌ నేత వి.హనుమంతరావు రాజీ యత్నాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నుంచి ఆయన గురువారం ఉదయమే హైదరాబాద్‌ చేరుకున్నారు. వచ్చిన కొద్దిగంటల్లోనే పీజేఆర్‌ ఇంటికెళ్లారు. పీజేఆర్‌తోను, ఆయన భార్యతోను, కుమారుడితోను మాట్లాడారు. సంఘటన వివరాలను, తదనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆయన కుమారుడు సుమధుర్‌రెడ్డి తమపై దాడి జరిగిన తీరును వివరించారు. ఇలా రెండు కుటుంబాల అభిప్రాయాలూ తెలుసుకున్న వీహెచ్‌.. ఆనక సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని సైతం కలసి మాట్లాడారు. జరిగిన వివాదంపై తక్షణం దృష్టిసారించకపోతే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని భావించి.. తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు వీహెచ్‌ ప్రకటించారు. ఆదివారం తాను హైదరాబాద్‌లో ఉండిఉంటే ఇంతవరకూ వచ్చి ఉండేది కాదన్నారు. ఆరోజే ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి ఉంటే సరిపోయేదన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తే పార్టీకి మంచిదని చెప్పారు. చిన్న పిల్లల తగాదా పెద్ద కాకుండా ఉండాల్సిందన్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎలాచేస్తే బాగుంటుందనే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. మొదట పీజేఆర్‌ ఆమరణ దీక్షను విరమింపజేయడం.. లేదంటే వాయిదా వేయిస్తే మిగతా అంశాలను పరిష్కరించేందుకు అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు గురించి తానేమీ మాట్లాడబోనన్నారు. మొత్తంమీద పీజేఆర్‌ డిమాండ్ల సాధ్యాసాధ్యాలను ఓవైపు పరిశీలిస్తూనే.. మరోవైపు దీక్ష చేపట్టకుండా చూడటమనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతల రాజీయత్నాలు సాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వివాదానికి ముగింపు పలకాలన్నది వారి లక్ష్యం!

కొన్ని గెజిటెడ్‌ పోస్టులకూ 610 eenadu

వంద శాఖాధిపతుల ఆఫీసులకు కూడా
ప్రభుత్వం అంగీకరించింది
ఉత్తమ్‌కుమార్‌ వెల్లడి

నాన్‌ గెజిటెడ్‌ నుంచి గెజిటెడ్‌గా మారిన పోస్టుల్లోనూ 610 అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 1975 తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ జరిగిన నియామకాలన్నింటినీ సరిచేయాలని నిశ్చయించింది. ఈ జీవోపై ఏర్పాటైన శాసనసభా సంఘం ఛైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాలు ప్రకటించారు. సభాసంఘం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై, జీవో అమలును సమీక్షించింది. ''అదనంగా సృష్టించిన వంద పైచిలుకు శాఖాధిపతుల కార్యాలయాలను మళ్లీ జోనల్‌ పరిధిలోకి తేవాలి. వాటిలోనూ 610 జీవోను అమలు చేయాలి. దీనిపై ఏమి చర్యలు తీసుకున్నదీ వారంలోగా నివేదిక ఇవ్వాలి. న్యాయశాఖకూ దీన్ని వర్తింపజేయాలి. ఈ జీవోపై కాంగ్రెస్‌ ఎంపీలు హైకోర్టులో వేసిన కేసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం గట్టిగా వాదించాలి. 610 సంబంధిత కేసులన్నింటిలోనూ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ స్వయంగా వాదనలు వినిపించాలి. సభాసంఘం తదుపరి భేటీకి ఆయన కూడా హాజరవ్వాలి. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో ఉండి, అనంతరం గెజిటెడ్‌గా మారిన పోస్టులకూ ఈ జీవోను వర్తింపజేయాలి. స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్లదలచుకున్న స్థానికేతర ఉపాధ్యాయులందరి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించాలి. బదిలీ చేసిన ఉద్యోగులను తక్షణం రిలీవ్‌ చేయాలి'' అంటూ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం తర్వాత ఉత్తమ్‌కుమార్‌ విలేఖరులతో మాట్లాడారు. న్యాయ, ఆదాయపు పన్ను శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లో మొత్తం 6,714 మంది స్థానికేతర ఉద్యోగులను ఇప్పటిదాకా గుర్తించినట్టు చెప్పారు. పోలీసు శాఖలో 2,406 మంది ఉన్నారన్నారు. ''అయితే ఇవి 20 శాతాన్ని స్థానికేతర కోటా (సీలింగ్‌) గా భావించి సేకరించిన వివరాలు. సీలింగ్‌ను తీసేస్తే ఈ సంఖ్య పెరగవచ్చు. కానీ కొన్ని పార్టీలు చెబుతున్నట్టు అది లక్ష దాకా ఉండే అవకాశం మాత్రం లేదు'' అని ఆయన వివరించారు. 5, 6 జోన్లలోని ప్రభుత్వోద్యోగుల స్థానికత వివరాలను త్వరలో వెబ్‌సైట్లో ఉంచి, అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించారు. ఇకనుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని నియామకాల్లో 610ని అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. విశ్వవిద్యాలయాలకూ వర్తింపజేయాలని తాము సూచించామన్నారు. కాగా 610 అమలులో అధికారులు, ప్రభుత్వం తీరుపై సభాసంఘం సభ్యులు పెదవి విరిచారు. దీన్ని సమగ్రంగా ఆచరణలోకి తేవాలంటూ తామూ కోర్టుకెళ్తామని ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తెలిపారు. ఇతర సభ్యుల అభిప్రాయాలు వారిమాటల్లోనే..
నాలుగడుగులు వెనక్కి: దేవేందర్‌ గౌడ్‌ (తెదేపా)
610 అమలు రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు చందంగా జరుగుతోంది. జీవో అమలు కాకుండా ప్రభుత్వం ప్రతిదానికీ మసిపూసి మారేడుకాయ చేస్తోంది. చివరికి సభాసంఘం పని స్వచ్ఛంద బదిలీలను పర్యవేక్షించే వ్యవహారంగా మారుతోంది. 610 అమలు ఆగకుండా కోర్టులో కెవియట్‌ వేయాలంటే సమాధానం లేదు. అధికారుల్లోనూ అంతా అయోమయం, అస్పష్టత. న్యాయపరంగా చిక్కులున్న అంశాలకు చర్చను పరిమితంచేసి, అర్థరహితంగా మార్చారు.

ముల్కీ అమలు చేయాలి: పీజేఆర్‌ (కాంగ్రెస్‌)
ఈ జీవో సమస్య ఉద్యోగుల పరిధి దాటి ప్రజల దాకా వెళ్లింది. పలు కాలనీల్లో స్థానిక, స్థానికేతర విభేదాలు తలెత్తుతున్నాయి. ఇది నానాటికీ ముదిరి ఇండియా- పాకిస్థాన్‌ గొడవ మాదిరిగా తయారవుతోంది. జీవో అమలులో ఎన్నో చిక్కులు వస్తున్నాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ మాట కూడా వినకుండా మా ఎంపీలు కొందరు దీనిపై కోర్టుకు వెళ్లారు. మరి ప్రభుత్వం, సభాసంఘం, మంత్రివర్గం, వైఎస్‌ ఏం చేస్తున్నట్టు? దీనిపై కెవియట్‌ ఎందుకు వేయడం లేదు? అధికారులను అడిగితే షరామామూలుగా 'ప్రాసెస్‌లో' ఉందంటున్నారు. జీవో స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలోనే ఆరో జోన్‌ నుంచి ఐదో జోన్‌కు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నారు. అందువల్ల దీనికి బదులు తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నట్టుగా ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. దీనిపై వైఎస్‌ ఆలోచించడం మంచిది.

వారే హీరోలూ, విలన్లూ: జూలకంటి రంగారెడ్డి (సీపీఎం)
610 విషయంలో కాంగ్రెస్‌ నేతలే హీరోలుగా, విలన్లుగా వ్యవహరిస్తున్నారు. అమలు చేయాల్సిందేనని కొందరు, అస్సలు కూడదని మరికొందరు వాదిస్తున్నారు. శాఖలవారీగా స్థానికేతర ఉద్యోగుల సంఖ్య, పేర్ల జాబితాను ఈ భేటీలో సమర్పించాలని, ఇంటర్‌నెట్లో కూడా పెట్టాలని క్రితంసారి సూచిస్తే అధికారులు స్పందించలేదు. గిర్‌గ్లానీ సిఫార్సులను పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి.

సమన్వయమేది: హరీశ్‌రావు (తెరాస)
610 అమలులో అధికారుల మధ్య సమన్వయమే లేదు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం పరిమితికి మించిన స్థానికేతరులను మాత్రమే పంపినట్టు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ శాఖలో 518 మందే ఉన్నారని గత భేటీలో, 1,105 మంది ఉన్నారని ఇప్పుడు చెప్పారు. స్థానికత విషయమై ఏ శాఖ నుంచీ పూర్తి సమాచారం లేదు. దిగువ స్థాయి కోర్టుల్లోని స్థానికేతరుల సమాచారం తెప్పించాలని నిర్దేశిస్తే అధికారులు స్పందించలేదు.

రౌడీయిజం నశించేదాకా పోరు eenadu

ఒక వ్యక్తి పేరుతోనే రాష్ట్రంలో గూండాయిజం నడుస్తోంది
ప్రాణాలు పోయినా లెక్కచేయను
గాంధీ మార్గంలో ఉద్యమిస్తా
న్యాయం జరగకుంటే దీక్ష తప్పదు
మా ప్రభుత్వంలో మాకు రక్షణలేదు
నా కుటుంబానికి భద్రత కల్పించాలి: పీజేఆర్‌

రౌడీయిజం నశించే వరకూ తన పోరాటం కొనసాగుతుందని, ఈ ప్రయత్నంలో తన ప్రాణాలుపోయినా లెక్కచేసేదిలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వ్యక్తి పేరు చెప్పుకుని నడుస్తున్న గూండాయిజం పోవాలి' అని అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తానని అన్నారు. గాంధేయవాద పద్ధతిలో తన పోరాటం ముందుకు సాగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్‌ వివాదంలో ప్రభుత్వం న్యాయం చేయకుంటే సోమవారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించిన నేపథ్యంలో... పీజేఆర్‌ గురువారం అసెంబ్లీ వద్ద విలేఖరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు తన ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేదిలేదని చెప్పాను. ఆయన గాయపడిన నా కుమారుణ్ని పరామర్శించారు' అని పీజేఆర్‌ అన్నారు. అయితే ఎవరి పేరిట గూండాగిరీ నడుస్తోందన్న ప్రశ్నకు మాత్రం పీజేఆర్‌ సమాధానం ఇవ్వలేదు. తెదేపాపై 30 ఏళ్ల పోరాటంలో తాను రక్తం చిందించిన సందర్భాలున్నా... తన భార్య, చెల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. కానీ మొన్నటి గొడవలో వెళ్లాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పశ్చిమ మండలం డీసీపీ మధుసూదన్‌రెడ్డే కారణమనీ, ఆయన్ను తక్షణం సస్పెండ్‌ చేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు. 'వస్తావా, లేపి తీసుకెళ్లాలా?' అంటూ తన బంధుమిత్రుల ముందే ఆయన దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. ఎవరో చెప్పిన ప్రకారం మధుసూదన్‌రెడ్డి నడుచుకున్నారని వ్యాఖ్యానించారు. 'పైగా నన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేనైన నాకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? నన్ను నేనే కాపాడుకోలేకపోతే నియోజకవర్గ ప్రజలనెలా కాపాడుకుంటాను? అందుకే ఈ విషయంలో న్యాయం జరిగే దాకా నిరాహార దీక్ష చేస్తాను' అన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటివద్ద కూడా పీజేఆర్‌ గురువారం విలేఖరులతో మాట్లాడారు. 'మా ప్రభుత్వ పాలనలో మాకే రక్షణ లేకుండా పోయింది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఘటన జరిగినప్పటినుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కరువైందని, పోలీసులు కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత రెండు రోజులుగా కొందరు అపరిచితులు తన కుమార్తె అనురాగిణిరెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకుని తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తమ చేతికి మట్టి అంటకుండా తీవ్ర స్థాయిలో నేరాలు చేసే వ్యక్తులు తన కుటుంబ సభ్యులపై దాడికి పథకం వేశారని ఆయన ఆరోపించారు. పశ్చిమ మండల డీసీపీ మధుసూదన్‌రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, సీఎం సోదరుడిపై కూడా 307 కేసును నమోదు చేయాలనే డిమాండ్లను పునరుద్ఘాటించారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా 16వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు.

పీజేఆర్‌ కుమార్తె ఇంటివద్ద పోలీసు భద్రత
తమ ఇంటి పరిసరాల్లో అనుమానితుల తిరుగుతున్నారని పీజేఆర్‌ అల్లుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీజేఆర్‌ కుమార్తె అనురాగిణి రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

610 జీవోపై శాసన సభా కమిటీ సమావేశం andhra jyoth

హైదరాబాద్‌, జూలై 12 ః 610 జీవో పై శాసన సభా కమిటీ గురువారం సమావేశమైంది. 610 జీవో అమలు, స్థానికేతరుల బదిలీ తదితర విషయాలపై సమావేశం సమీక్ష నిర్వహించనుంది. కాగా ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానికేతరుల గుర్తింపు, సరైన విధి విధానాలు, పారదర్శకత తదితర అంశాలు చర్చించే అవకాశం వుంది. జీవో అమలుకు సంబంధించి టిఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు హరీష్‌ రావు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడాన్ని కూడా కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం వున్నట్లు సమాచారం. హౌస్‌ కమిటీ సమావేశం కారణంగా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు