Friday, July 6, 2007

610 బదిలీలపై ఎల్లుండి హైకోర్టులో పిటిషన్‌ eenadu

ముల్కీ కాలం చెల్లిపోయింది రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలి హరిరామజోగయ్య వ్యాఖ్యలు

ముల్కీ కాలం చెల్లిపోయిందని, దాన్ని 1975లోనే రద్దు చేసి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. అసలు ముల్కీ విధానమే సరైంది కాదని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''1975లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలు చేయాలనడం సరికాదు. నాడు స్థానికేతరులుగా ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది ఇప్పుడు స్థానికులు అయిపోయారు. అందువల్ల వారిని బదిలీ చేయాలనడం న్యాయ సమ్మతం కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులను 2007 నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందిని స్థానికేతరుల పేరుతో ప్రభుత్వం బదిలీ చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా తాను, ఎంపీ హర్షకుమార్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు. ''రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కానేకాదు. ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మాపై ఉంది. ఆంధ్ర ప్రాంతంలో పార్టీని రక్షించుకునే చర్యల్లో భాగంగానే నేను జీవో అమలును వ్యతిరేకిస్తున్నాను'' అని ఆయన వివరించారు. కేవలం కొందరి ఒత్తిళ్ల వల్లే వైఎస్‌ 610 జీవోను అమలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ''బదిలీ చేస్తున్న ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతంలోని ఖాళీల్లోనూ, సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లోనూ నియమిస్తే అక్కడ మా వాళ్లకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అందువల్ల బదిలీ అయ్యే వారికి ఇక్కడే సూపర్‌ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఆంధ్ర ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలి'' అని ఆయన డిమాండ్‌ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఇరు ప్రాంతాల నేతలను పిలిచి దీనిపై చర్చించాల్సి ఉందని జోగయ్య అభిప్రాయపడ్డారు.

610పై మరో రగడ eenadu

పాఠశాల విద్యాశాఖలో తాజా వివాదం
43ని సవరిస్తూ కొత్త జీవో
కలెక్టర్లకు పోస్టింగ్‌ అధికారం
కోర్టుకెక్కనున్న ప్రభుత్వ టీచర్లు
రాష్ట్రపతి దృష్టికి వివాదం
టీఆర్‌టీయూకు అందిన పిలుపు
ఏకీకృత సర్వీసుకు ఎసరు!
పాఠశాల విద్యాశాఖలో స్థానికేతర ఉపాధ్యాయుల బదిలీపై మరో వివాదం చెలరేగింది. 610 అమలు కోసం ఇచ్చిన జీవో 43లో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 45ను జారీ చేసింది. ఇందులో డీఈవో, సీఈవోలకు బదులుగా జిల్లా కలెక్టర్లకు పోస్టింగు అధికారాలివ్వడం వివాదాస్పదమైంది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకే ఎసరు పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. తాజా జీవో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని ప్రభుత్వ టీచర్ల సంఘం ఆరోపించింది. ''గతంలో జారీ చేసిన 529 జీవో ఉపాధ్యాయుల నియామక అధికారి డీఈవో అని చెప్పింది. కానీ తాజా జీవోలో ఈ అధికారాలను కలెక్టర్‌కు అప్పగించారు. ఇది సమస్యగా మారనుంది'' అని నిపుణులు అంటున్నారు. ఇదే వాదనతో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్పుడే కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రస్తుతం 610 ప్రకారం స్వచ్ఛంద బదిలీలు మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో నిర్బంధ బదిలీలు చేసినా... కలెక్టర్లకే నియామకాల అధికారాన్ని ఇస్తూ జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలా బదిలీ అయ్యేవారు కోర్టును ఆశ్రయించే అవకాశం, ఫలితంగా 610/రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు సందిగ్ధంలో పడే వీలు కనిపిస్తున్నాయి. ఏకీకృత సర్వీసు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ యత్నాలకు ఇది గండికొట్టే అవకాశం ఉంది.
610 అమలుకై జారీ చేసిన జీవో 43లో పేర్కొన్న అంశాలు ఉపాధ్యాయుల వేర్వేరు సర్వీస్‌ను సూచిస్తున్నాయని, ఇది ఇన్నాళ్ల తమ పోరాటానికి గండి కొడుతుందంటూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త పోరాట సమితి (జాక్టో) ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రినీ కలిసి ఈ జీవోను సవరించాలని కోరింది. కానీ ఇలా చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయంటూ సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు న్యాయ విభాగం, ఉన్నతాధికారులు అభ్యంతరపెట్టారు. అయినా జాక్టో ఒత్తిడితో, ముఖ్యమంత్రి ఆదేశాలతో సవరణ జీవో జారీ అయింది. ఈ జీవో పట్ల న్యాయవిభాగం అసంతృప్తితో ఉంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏకీకృతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని జాక్టో నేతలు గురువారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తీరు... ఇన్నాళ్లూ కాస్తో కూస్తో సానుకూలంగా దీనికై యత్నించిన అధికార వర్గాల్నీ, మంత్రినీ తీవ్ర నిరుత్సాహంలో పడేసింది.
ఢిల్లీ పయనమూ ప్రశ్నే
ఈనెల 9న ఢిల్లీకి మూకుమ్మడిగా వెళ్లి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు కోసం ప్రయత్నాలు చేయాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం. కానీ కేంద్రం వ్యక్తీకరించిన సందేహాలకు ఇప్పటికీ రాష్ట్రం సమాధానాలను పంపించలేదు. ఆ ఫైల్‌ ఢిల్లీ చేరక ముందే వెళ్లి ఏం చేయాలనే ప్రశ్న తాజాగా తలెత్తింది. అందుకని 9న ఢిల్లీలో ఎంపీలందరూ ఉండటం లేదనే సాకుతో ప్రయాణాన్ని వాయిదా వేయనున్నట్లు తెలిసింది. కేంద్రానికి సమాధానాలు ఏమని పంపాలో అర్థం గాక ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్‌ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించినా... అది మరిన్ని చిక్కులకు దారితీయవచ్చునని న్యాయవాదులు హెచ్చరించడంతో ఆ ప్రయత్నమూ వాయిదా పడినట్లు సమాచారం. ''ఈ స్థితిలో ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాం?'' అని ఓ నేత ప్రశ్నించారు.
రాష్ట్రపతి రమ్మన్నారు!
ఏకీకృత సర్వీస్‌ కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తీసుకొచ్చే ప్రతిపాదన భవిష్యత్తులో తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ప్రమాదకరం అయ్యే అవకాశాలున్నాయని వాదిస్తున్న టీఆర్‌టీయూ ఈసారి ఏకంగా రాష్ట్రపతినే కలిసి తన వాదనను వినిపించడానికి తయారవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతికి అపాయింట్‌మెంట్‌ కోసం దరఖాస్తు పెట్టుకోగా, ఆయన ఈనెల 16న రావాలంటూ సమ్మతి తెలిపారు. ''రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలోని కనీసం అయిదు అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని నిండా ముంచేస్తాయి. అదే రాష్ట్రపతికి వివరిస్తాం'' అని టీఆర్‌టీయూ చెబుతోంది. వెరసి 610 అమలు వ్యవహారంతో ఏకీకృత వివాదం ముదిరి పాకానపడుతోంది!

610 జీఓపై అనవసర రాద్ధాంతం eenadu

హైదరాబాద్‌, జులై 6 : 610 జీఓపై ఆంధ్ర నాయకులు చేస్తున్న ప్రకటనలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌కు పాల్వాయి గోవర్థనరెడ్డి ఫిర్యాదు చేశారు. పీసీసీ కూడా దీనికి వంతపాడటం తెలంగాణాలి,ా్‌్‌X

నెలాఖర్లోగా జాబితా eenadu

20% ఓపెన్‌ కేటగిరిగా పరిగణించాలి
1975 నుంచీ నియామకాల పరిశీలన
సత్వరమే డెప్యుటేషన్ల రద్దు
610పై హరినారాయణ ఆదేశాలు
రికార్డుల్లేవన్న అధికారులు
మరో 70 మంది కానిస్టేబుళ్ల బదిలీ

రాష్ట్రంలో 610 జీవో అమలు కోసం... 1975 నుంచీ జరిగిన నియామకాలను పరిశీలించి, అందులో స్థానికేతరుల జాబితాను నెలాఖరుకు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.హరినారాయణ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. డెప్యుటేషన్లను వెంటనే రద్దు చేసి, ఆయా అభ్యర్థులను వారి సొంత ప్రాంతాలకు పంపించాలన్నారు. 610 జీవో అమలుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''610ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాంశంగాపరిగణిస్తోంది. దీని అమలుకు అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 1975 నుంచీ జరిగిన నియామకాల్లో జిల్లా స్థాయి పోస్టుల్లో 20 శాతాన్ని ఓపెన్‌ కోటా కింద పరిగణించి అవి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా అనేది పరిశీలించాలి. మిగతా 80 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా చూడాలి. ఓపెన్‌ కేటగిరీ స్థానికేతరుల కేటగిరీ అనే భావన ఉంటే దానిని మీ మనసులోంచి తొలగించండి'' అంటూ ఉద్బోధించారు. జోనల్‌, కొన్ని గెజిటెడ్‌ పోస్టుల భర్తీ 30:70, 40:60 ప్రాతిపదికగా జరిగిందీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ''1975 నుంచి విద్య, వైద్య, పోలీసు శాఖల్లో దాదాపు ప్రతి ఏటా నియామకాలు జరిగాయి. ఇతర శాఖల్లో 8 నుంచి 9 దఫాల నియామకాలు జరిపారు. కొన్ని నియామకాల్లో ఓపెన్‌ కేటగిరీని స్థానికేతరుల కోటాగా పరిగణించి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అలాంటివారిని గుర్తించి సొంత జిల్లాలకు పంపాల్సిఉంది'' అని చెప్పారు.
గెజిటెడ్‌ కేటగిరీలో
స్థానికులకు కేటాయించిన పోస్టుల్లో ఇతర ప్రాంతాల వారిని డెప్యుటేషన్‌పై నియమించడం అక్రమమంటూ, వారిని వెంటనే వెనక్కి పంపాలని హరినారాయణ ఆదేశించారు. కొన్ని గెజిటెడ్‌ పోస్టుల విషయంలో సంబంధిత అధికారులు పనిచేసే పోస్టు స్థానిక కేటగిరీలోనిది అయితేనే ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. ఆ పోస్టు ఓపెన్‌ లేదా రాష్ట్రస్థాయి కేటగిరి పరిధిలోనిది అయితే మినహాయించాలని ఆయన అన్నట్లు తెలిసింది. జీవో అమలుకు సంబంధించి మరికొన్ని మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో జారీ చేస్తామని ఆయన చెప్పారు.
రికార్డులుంటేగా?
1975 నుంచి ఉద్యోగ నియామాలకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవంటూ ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు హరినారాయణకు వివరించారు. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ గౌతంకుమార్‌ మాట్లాడుతూ... గడిచిన నాలుగైదు దఫాలవి మినహాయిస్తే ఇతర నియామకాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని వివరించినట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో జరిగిన నియామకాలకు సంబంధించి రికార్డులు సేకరించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... అందుబాటులో ఉన్న వివరాలను పరిగణనలోనికి తీసుకొని జాబితాలు రూపొందించాలని సూచించారు.
మరిన్ని బదిలీలు
610 జీవో అమలులో భాగంగా స్వస్థలాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్న మరో 70 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌ సింగ్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కమిషనరేట్‌ నుంచి రెండు దఫాలుగా 248 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు.
డెప్యుటేషన్లలో ఆర్మీ, నేవీలకు మినహాయింపు
కారుణ్య పోస్టులకూ 610 వర్తింపు
కారుణ్య, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ (ఆరోగ్యపరమైన అనర్హత) కేటగిరీ నియామకాలకు సంబంధించి కూడా 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డెప్యుటేషన్ల రద్దులో ఆర్మీ, నేవీ ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని తీర్మానించింది. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ ఈ మేరకు సంకేతాలను అందించారు. ''దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, నేవీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాముల విషయమై ప్రత్యేక జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. దానికి అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం'' అని చెప్పారు. కారుణ్య, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ విభాగాల్లో జరిగిన నియామకాల గురించి ప్రస్తావిస్తూ... వాటినీ స్థానిక, స్థానికేతర కేటగిరీగా విభజించి ప్రత్యేక జాబితా రూపొందించాలని ఆయన ఆదేశించారు. వాటిపైనా త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.