Thursday, October 4, 2007

వాషింగ్టన్‌లో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు Eenadu

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 400మందికి పైగా తెలంగాణవాసులు పాల్గొనడం విశేషం. రాజేశ్‌ బాదం స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం తెలంగాణ సంప్రదాయ రుచులతో కూడిన భోజనాన్ని అతిథులకు వడ్డించారు. తరువాత జరిగిన ఆటపాటల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల బతుకమ్మలు...
మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో తమతో తీసుకు వచ్చిన బతుకమ్మలపై రంగురంగుల పూలను దానిపై ఉంచి సంప్రదాయబద్ధంగా గానం చేశారు. దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ వేడుక తెలంగాణ పల్లె జీవితాన్ని అమెరికాలో సాక్షాత్కరించింది. త్రిశ సంకినేని భరతనాట్యపదర్శన అందర్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం సమయంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తుపిండిని అందరికి పంచారు. ఆచార్య సవితానంద అవథూత ధ్యానంపై ఉపన్యాసమిచ్చారు. టీడీఎఫ్‌ చేపడుతున్న కార్యక్రమాల గురించి సంస్థ సమన్వయకర్త రాజేశ్‌ మాదిరెడ్డి సభికులకు వివరించారు. రవి పులి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. కళ్యాన్‌ ముద్దసాని, రమాకాంత్‌ పీచర, రాజేశ్‌ బాదం, సతీష్‌ మేదవరపు. అమర్‌ జన్నుపురెడ్డి. చంద్ర కంచర్ల, వెంకట్‌ రెడ్డి, అచ్యుత్‌ చుక్క, దీపక్‌ దేశ్‌పాండే, రాజేశ్‌ మాదిరెడ్డి, విష్ణు యాచమనేని, గీతా మేదవరపు, అరవింద ఎడ, శ్వేత, సుశీల... తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కేసీఆర్‌ చరిత్రలో కలిసిపోతావ్‌ : పీసీసీ Andhra Jyothy

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4(ఆన్‌లైన్‌): కాంగ్రెస్‌ పార్టీని.. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చరిత్రలో కలసిపోవడం ఖాయమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జోస్యం చెప్పింది. గాంధీభవన్‌లో గురువారం పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రతిసారి కాంగ్రెస్‌పార్టీని, వై ఎస్‌ను కేసీఆర్‌ దుర్భాషలాడడం గర్హనీయమని కోదండ రెడ్డి పేర్కొన్నారు. వాపును చూసి బలుపుగా టీఆర్‌ఎస్‌ భావిస్తోందని.. కరీంనగర్‌ పార్లమెంటు ఉప ఎన్నికను తెలంగాణ ఏకాభిప్రాయంగా భావించడానికి వీల్లేదని.. ఇదే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే.. టీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఎందుకు నిలిచిందని కోదండ రెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనగా మారిందని.. ఎక్కడ చూసినా కేసీఆర్‌, ఆయన కుమారుడు, అల్లుడుల ఫోటోలే కన్పిస్తున్నాయి తప్పితే.. మరో నాయకుడికి తగిన గుర్తింపే లేదని చెప్పారు. గోధమతో సమానంగా.. లేదా.. అంతకంటే ఎక్కువ మద్ధతు ధరను వరికి ప్రకటించాలని తులసిరెడ్డి కేంద్రాన్ని కోరారు. వ్యవసాయం దండగ మారిదని భావించిన చంద్రబాబు పాలనలో వరికీ, గోధమకు మధ్య మద్ధతు ధరలో వ్యత్యాసం నెలకొందని చెప్పారు. 1994-95లో ఈరెండింటికీ మద్ధతు ధర 360 రూపాయలుంటే.. 2003-04లో గోధుమకు 630 రూపాయలు లభిస్తే.. వరికి మాత్రం 580 దక్కిందని చెప్పారు. ఈ వ్యత్యాసంపై ఆనాడే నిరసన తెలిపి ఉంటే.. ఈ రోజు ఈ విధానం కొనసాగేది కాదని ఆయన పేర్కొన్నారు.