Sunday, July 1, 2007

వై.ఎస్‌, బాబు తెలంగాణ వదిలిపోవాలి: గద్దర్‌ Vaartha

నల్లగొండ, జూలై 1, ప్రభాతవార్త'


ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు తెలంగాణను విడిచి పెట్టాలి. అప్పుడే మా నీళ్లు,మా భూమి, మా నిధులు, మా ఉద్యోగాలు అన్నింటికంటే ముఖ్యంగా మా హక్కులు మాకు దక్కుతాయి. తెలంగాణేతరుల పాలనలో ఈ ప్రాంతం రక్తాన్ని చిందించి ఉద్యమాల బాట పట్టింది. ఇకనైనా మా తెలంగాణను మాకు వదిలేసి మీ ప్రాం తానికి బయల్ధేరండి' అంటూ ప్రజా గాయకుడు గద్దర్‌ నిప్పులు కక్కారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ ఏర్పాటుచేసిన సమరభేరి ఆటాపాట కార్య క్రమానికి గద్దర్‌ ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడారు. వై.ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయాన్ని చేస్తుందని గద్దర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బూర్జువా పాలకులు తెలంగాణా ప్రజలను మోసం చేయడానికే జి.ఓలు, కమిషన్‌లు, పధ కాలను ప్రవేశపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మోసాలు మాకొద్దుమా తెలంగాణ మాకు కావాలి అని గద్దర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలను విస్మరిస్తేనే ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా ఉద్యమాలు పుట్టు కొస్తాయని చెప్పారు. దగాకోరు వైఎస్‌ ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలంటే ఉద్య మాలకే సాధ్యమని అన్నారు. పోతిరెడ్డిపాడు,పులిచింతల ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజలను ముంచిన నీళ్లతో ఆంధ్ర, రాయలసీమ రైతులకు అన్నం పెట్టడానికి వైఎస్‌ కుట్రపన్నుతున్నాడని గద్దర్‌ ఆరోపించారు. తెలంగాణ వాదులు తిరుగుబాటుకు సిద్దమై 'క్విట్‌ తెలంగాణ' నినాదంతో ఉద్యమాలను బలోపేతం చేయాలని ఏవిధంగానూ స్థానికే తరులకు సాయపడద్దని గద్దర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్యకార్యచరణ కమిటీ కన్వీనర్‌ పాశం యాదగిరి పాల్గొన్నారు.

ి '610' రాగాలు Vaartha

వాద ప్రతివాదనలు, వేడి వేడి వ్యాఖ్యలు... వెరసి '610' రాగాలు
జిఒ అమలు పై సర్కార్‌ రాజకీయం
తెలంగాణ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్‌, జూలై 1, ప్రభాతవార్త

610 జీవో అమలులోరాజకీయాలకు పాల్పడుతూతెలంగాణ జిల్లాల ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని ప్రభుత్వం కలిగిస్తున్నదని తెలంగాణా ఉద్యోగుల సంఘం ఆరోపించింది. స్థానికేతరులను గుర్తించి వారందరిని పంపించడంలో ఎలాంటి తారతమ్యాలు చూపకుండాన్యాయంగా నడుచుకోవలసిన ప్రభుత్వం ఇక్కడ కూడా కేవలం తెలంగాణ జిల్లాలకు చెందినస్థానికేతరులను మాత్రమేపంపించేలా చర్యలు తీసుకోవడం శోచనీయమని సంఘం నాయకుడు విఠల్‌ అన్నారు. నగర పోలీసు శాఖలో మొత్తం 3200 మంది స్థానికేతర కానిస్టేబుళ్లను గుర్తించారని,ఇందులో రెండు వేలమందిఆంధ్రా ప్రాంతానికి చెందిన వారుకాగా,మిగతా వారు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ఇందులోఆంధ్రా ప్రాంతం వారిని పంపించడంలోజాప్యం చేస్తూ తెలంగాణ జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లను పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక రాజకీయం ఉందని ఆయన ఆరోపించారు.మొదట తెలంగాణ జిల్లాలవారినిపంపించి,610జీవో అంటే ఇదేనని చెబుతూ ఇక్కడి వారిలో అభద్రతా భావాన్ని పాదుకొల్పే కుట్ర సాగుతున్నదని ఆయన తెలిపారు.దాదాపుగాఇదేపల్లవినికాంగ్రెస్‌నాయకులు లగడపాటి రాజగోపాల్‌, గాదెవెంకట్‌రెడ్డిలు అందుకోవడాన్ని విఠల్‌ ఈ సందర్బ ంగా ఉదహరించారు. ఆంధ్రాకు చెందిన కానిస్టేబుళ్లను పంపించే విషయానికి వచ్చేసరికి ఏదో సాకులు చెబుతూ వారు కోర్టులను ఆశ్రయించేలా చేస్తున్నారని తెలిపారు. అలాగే 321 మంది ఎస్‌ఐలు, సిఐలు స్థానికేతరులుగా తేలితే అందులోనలభై మందితెలంగాణ జిల్లాలకు చెందిన వారుండగా,మిగతా వారంతాఆంధ్రా ప్రాంతానికిచెందిన వారని, వీరు జోనల్‌ విధానంలోకి వచ్చినప్పటికీ పంపించడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా జిల్లాలకు చెందిన వారిని మొదట పంపించి, 610 జీవో అంటే ఇదేననే అభిప్రాయాన్ని పెంపొందించి అపోహలకు తావిచ్చేలా ప్రభుత్వం చర్యలు సాగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆయన హెాచ్చరించారు.
లగడపాటికి మతిభ్రమించింది
ఆంధ్రాహంకారం
అందుకే ఇష్టమొచ్చిన మాటలు: హరీష్‌
సిద్దిపేట అర్బన్‌, జూలై 1, ప్రభాతవార్త
విజయవాడ ఎం.పి.లగడపాటి రాజగోపాల్‌ ఆంధ్రాహాం కారముతోమతిభ్రమించి జి.ఒ.610పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ధ్వజమెత్తారు.మెదక్‌జిల్లా సిది ్దపేటలో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. జీవోపై ఆయనకు సరైన అవగాహన లేక టిఆర్‌ఎస్‌కు అవగాహన లేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జీవోలు 390, 415లో ఆంధ్ర పక్షపాత బుద్ది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఆ జీవోలను కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. అన్ని తెలంగాణ జిల్లాల్లో నాన్‌ లోకల్‌ వారు ఉన్నారని తెలిపారు. అన్నదమ్ముల్లా విడిపోదామని టిఆర్‌ఎస్‌ కోరుతోంది తప్ప పరాయి దేశంలా వేరుపడదామని కోరడం లేదన్నారు.కరీంనగర్‌ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్‌కుతెలంగాణ ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా మేలుకోలేదన్నారు.
610 అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
జీవో.610అమలులో ప్రభుత్వానికి ఏ మాత్రంచిత్తశుద్ది లేదనిహరీష్‌ విరుచు పడ్డారు.జీవోఅమలులో తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.తెలంగాణేతరులను వెంటనే పంపిపంచాలని డిమాండ్‌ చేశారు.జీవోఅమలుకై టిఆర్‌ఎస్‌ మూడేళ్ళుగా ఓపిక పట్టామని.జీవో ఉల్లం ఘన జరగడం వల్లనే రాష్ట్ర క్యాబినేట్‌నుంచి తప్పుకున్నామని చెప్పారు.జీవో610 పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ముల్కి ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని హెాచ్చరించారు.తప్పనిపరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష యుద్ధానికిసిద్ధమవుతున్నారని తెలిపారు.ఓపిక నశించి సచీవాలయం ముట్టడికి సిద్ధమయ్యామని చెప్పారు. సచివాలయ ముట్టడికి వస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని, అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని హెాచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెాచ్చరించారు.

610అమలుపై బహిరంగ చర్చకు సిద్ధం andhra jyothi

వినోద్‌కు లగడపాటి సవాల్‌
హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌): ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సమస్యను ప్రాంతీయ విభేదాలుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రయత్నిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆదేశాలూ, 610 ఉత్తర్వులోని అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధమేనని టి ఆర్‌ ఎస్‌ ఎంపీ వినోద్‌కు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వు అమలును రాజకీయం చేయవద్దని తాను మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను కోరుతున్నానని ఆదివారం 'ఆన్‌లైన్‌'తో మాట్లాడుతూ చెప్పారు.
610 ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు .. ఈ ఉత్తర్వులను తూ.చ తప్పకుండా అమలు చేస్తే ఎవరికి నష్టం జరుగుతుందో గ్రహించాలని సూచించారు. రాష్ట్రపతి ఆదేశాలు, ఆరు సూత్రాల కార్యక్రమం ప్రకారం జోనల్‌ విధానాన్ని అనుసరించాలని, అదేవిధంగా.. పోలీసు, ఉపాధ్యాయ నియామకాలు జిల్లా యూనిట్‌గా ఉంటున్నందున.. వీటిలో 610 అమలు చేస్తే స్థానభ్రమసం జరిగేది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకేనని గుర్తెరగాలని పేర్కొన్నారు.
పైగా.. ఈ సమస్య కేవలం ఉద్యోగులకు మాత్రమే సంబంధించినదని.. దానిని రాజకీయ రాద్ధాంతం చేసేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై బహిరంగంగా చర్చించేందుకు రావాలని తాను ఎంపీ వినోద్‌ను కోరానని అన్నారు. అయితే.. ఆయన వరంగల్‌లో ఉన్నట్లు చెప్పారని వివరించారు. ఈ అంశంపై ఐదో తేదీన బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే.. ఇంకా సమావేశ స్థలాన్ని ఖరారు చేయలేదని ఆయన చెప్పారు. వాటిని త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.

610పై టిఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది: కేకే andhra jyothi

హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌): 'ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణీత కాలవ్యవధిలో 610 ఉత్తర్వును అమలు చేయాలని కోరుకుంటోంది .. ఇందుకు సంబంధించి చర్యలు వేగవంత చేసింది .. ఇప్పటికే బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది .. ఇంత కంటే ఏం చేయాలి'అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు ప్రశ్నించారు. రాజకీయం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపమెక్కడుందో చెప్పాలని టిఆర్‌ఎస్‌ నేతలను కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 610 ఉత్తర్వు అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, సభా సంఘాన్ని కూడా నియమించిందని అన్నారు.
ఇంకా కావాలంటే.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమేనని.. అ సమావేశానికి టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కూడా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇప్పటివరకూ నాలుగువేల మంది వరకూ స్థానికేతర ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. గత ఇరవై రెండేళ్లుగా 610 ఉత్తర్వుల అమలుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గాని, ఆ పార్టీలోనే కొనసాగిన కేసీఆర్‌గాని మాట్లాడలేదని కేకే అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని ప్రయత్నిస్తుంటే.. రాజకీయ రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎందుకు సచివాలయాలన్ని ముట్టడి చేయాల్సి వస్తోందో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రజలకు వివరించాలని అన్నారు.
గిర్‌గ్లాని నివేదిక గురించి గాని.. 610 ఉత్తర్వు గురించి గాని టిఆర్‌ఎస్‌ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. లక్షలాది మంది స్థానికేతర ఉద్యోగులు ఉన్నారని అంటున్నారని.. ప్రభుత్వం లెక్కలు తీస్తే.. నాలుగువేల మంది మాత్రమే ఉన్నట్లు తేలిందని.. ఇంకా మరో పదిహేను వందల మంది వరకూ ఉంటే ఉండోచ్చని అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నట్లు లక్షల సంఖ్యలో స్థానికేతర ఉద్యోగులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 610 ఉత్తర్వు పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర సమితికి చిత్తశుద్ధి లేదని .. ఆ సమస్య పరిష్కారమైతే.. ఇక మాట్లాడేందుకు ఆ పార్టీకి ఏ అంశమూ ఉండదని కేకే అన్నారు. గతంలో 399,415 ఉత్వర్వులను వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు వాటిని అనుసరించే మార్గదర్శకాలు రూపొందించి, బదిలీల ప్రక్రియను చేపట్టారని పేర్కొన్నారు.

ఆంధ్రా అధికారులతో 610 సాధ్యం కాదు andhra jyothi

హైదరాబాద్‌, జూలై 1 (ఆన్‌లైన్‌) : ఆంధ్రా అధికారులతో 610 ఉత్తర్వు అమలు సాధ్యం కాదని శాసనమండలి సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావిస్తున్నట్టుగా ఈ ఉత్తర్వును చిత్తశుద్ధితో అమలు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాదికి చెందిన అధికారిని నియమించాలని పేర్కొన్నారు. అదేవిధంగా సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిగానూ, హోం శాఖ కార్యదర్శిగానూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారులకు బదులు ఇతర ప్రాంతాలకు చెందినవారే ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్థానికేతర ఉద్యోగులు లక్షల్లో ఉంటే.. కేవలం నాలుగువేల మంది మాత్రమేనని అధికారులు పేర్కొనడంతోనే.. ఆంధ్రా ప్రాంత అధికారులతో 610 అమలు సాధ్యం కాదని తేలిపోయిందని పేర్కొన్నారు. ఏయే విభాగాల్లో ఎందరెందరున్నారన్న సమాచారాన్ని 1975 నుంచి వెలికి తీస్తే.. స్థానికేతరుల అసలు సంఖ్య బయట పడుతుందని అన్నారు. 610 ఉత్తర్వులను ఆరుసూత్రాల కార్యక్రమం స్ఫూర్తితో అమలు చేయాలని ఆయన కోరారు.

ముగిసిన తెలంగాణ మేధావుల సదస్సు andhra jyothi

తార్నాక, జూలై 1 (ఆన్‌లైన్‌): చారిత్రక తెలంగాణ ప్రాంతంలో జరిగిన సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన పోరాటాల్లో అణగారిన మెజారిటీ కులాలే ప్రముఖ పాత్ర పోషించాయని, అయితే అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల కుట్ర వల్ల వారి త్యాగాలకు గుర్తింపు లేకుండాపోయిందని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, మేధావులు అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీపుల్స్‌ తెలంగాణ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో 'పీపుల్స్‌ తెలంగాణ' అంశంపై రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు వివిధ అంశాలపై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాలపై దృక్ప«థాలు అనే అంశంపై డాక్టర్‌ తిరుమల మాట్లాడుతూ భూమి కోసం తెలంగాణ ప్రజలు 1940లో జరిపిన సాయుధ పోరాటం కంటే ముందు నుంచే సర్దార్‌ పాపన్న వంటి వీరుల నాయకత్వంలో పోరాటాలు చేశారన్నారు.
కులం, మతం, తెలంగాణ ఉద్యమ ప్రజాస్వామీకరణ అనే అంశంపై ప్రొఫెసర్‌ సింహ్రాద్రి మాట్లాడుతూ 1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేరిట ఆంధ్ర ప్రాంతంలో కలపడం నుంచి నేటి టి.ఆర్‌.ఎస్‌. పార్టీ చేస్తున్న స్వార్థ రాజకీయ ప్రక్రియ వరకు మెజారిటీ ప్రజలు సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. వారి సమస్యలతో సంబంధం లేకుండా అల్ప సంఖ్యాక ఆధిపత్య కులాల ప్రయోజనం కోసం పని చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో కులం - అంబేద్కర్‌ దృక్ప«థం అంశంపై డాక్టర్‌ మల్లేశం మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్ర«ధానంగా సామాన్యుడి సమస్యలైన కుల, పితృస్వామిక ఆధిపత్యాలను కట్టడి చేస్తుందన్నారు. అంబేద్కర్‌ ఆలోచనా విధానాలు-చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే అంశంపై డాక్టర్‌ జి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నేటి దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బహుజన సమాజ్‌ వంటి పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరగాలని అభిప్రాయపడ్డారు.

రాయలసీమ ఉద్యోగులపై చెయ్యేస్తే... తీసేస్తాం eenadu

ఆంధ్రావాళ్ల లుంగీలు త్వరగా లాగండి
అప్పుడైనా మా వాళ్లకు రోషం వస్తుంది
తిరుమల నిధులు మళ్లిస్తే వూరుకోం
హైదరాబాద్‌ మీరు తీసుకుంటే... శ్రీశైలం నీళ్లు మేం
తీసుకుంటాం
టీజీ వెంకటేష్‌ వ్యాఖ్యలు
కర్నూలు, నంద్యాలటౌన్‌- న్యూస్‌టుడే
610 జీవో అమలుపై జరుగుతోన్న రగడ నేపథ్యంలో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్‌ మళ్లీ గళమెత్తారు. తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ సోమవారం చేపడుతున్న సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమం సరికాదన్నారు. రాయలసీమ ఉద్యోగులపై చెయ్యేస్తే... చెయ్యి తీస్తామని హెచ్చరించారు. సీమ ఉద్యోగుల రక్షణకు ఓ సేనను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు, నంద్యాలల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ''నాడు ఉద్యోగాలకు అర్హులైన వారు దొరక్కపోవడంతో కోస్తా, రాయలసీమ నుంచి వెళ్లారు. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్లమనడం సబబు కాదు'' అని పేర్కొన్నారు. ''హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్ల లుంగీలు లాగుతామంటున్నారు. అదేదో తొందరగా చేయండి. అప్పుడన్నా మావాళ్లకు రోషం వచ్చి సీమ అభివృద్ధికి కృషి చేస్తారు'' అని టీజీ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ మా అబ్బ సొత్తు అని తెరాస ఎమ్మెల్యే హరీష్‌ పేర్కొనడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లెక్కన శ్రీశైలం డ్యాం తమ అబ్బ సొత్తుగా టీజీ పేర్కొన్నారు. ''దీనికి ఒప్పుకునేందుకు వారు సిద్ధంగా ఉంటే... పెద్దవాళ్లం కూర్చొని మాట్లాడుకుంటాం'' అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 'ఓవర్‌ యాక్టివ్‌'తో 610జీవో అమలుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ''610జీవో అమలైతే తెలంగాణ సమస్య సమసిపోతుందని వైఎస్‌ భావిస్తున్నారు. ఆ సమస్య తీరదన్న విషయం ఆయన అర్థం చేసుకోవాలి'' అని పేర్కొన్నారు. రాయలసీమలో ఉన్న తిరుపతి, శ్రీశైలం ఆలయాలకు వచ్చే నిధుల్ని సీమలోనే వినియోగించాలని టీజీ డిమాండ్‌ చేశారు. వేరే ప్రాంతాల్లో ఆ నిధుల్ని వినియోగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కోస్తా, తెలంగాణలో ఉన్న దేవాలయాలకు అత్యుత్సాహంతో తిరుపతి నిధులను మళ్లించారని... పుష్కరాలప్పుడు కూడా ఇదే విధంగా వాడారని విమర్శించారు. రాయలసీమకు చెందిన విద్యుత్‌ బోర్డులు రెండూ కోస్తా, తెలంగాణలో ఉన్నాయని, వాటిని వెంటనే సీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు బెంచ్‌తో పాటు, కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలు వరదలతో సతమతమవుతుంటే... తెరాస సభ్యులు 610జీవో అమలుపై రాజకీయం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ''కష్టాల్లో ఉన్నప్పడు కనీస సానుభూతి కూడా చూపించరా? మనిషిగా పుట్టిన వారిలా చేస్తారా?... ధర్నా చేస్తాం... ముట్టడి చేస్తాం అని ఇప్పుడా అనేది? కేసీఆర్‌ తెదేపాలో ఉన్నప్పుడు జీవో అమలుపై మాట్లాడకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయారా?'' అని తీవ్రంగా మండిపడ్డారు.
వల్లభాయ్‌పటేల్‌ హైదరాబాద్‌ను విముక్తి చేయకపోతే చరిత్రలో అదో మినీ పాకిస్థాన్‌గా మిగిలేదని టీజీ పేర్కొన్నారు.

ఉద్యమంలోకి విద్యార్థులు eenadu

ప్రతి కళాశాలలో తెరాస కమిటీలు
తెలంగాణ భవన్లో ప్రత్యేక శిక్షణ
జిల్లాస్థాయి నేతలకు కేసీఆర్‌ నిర్దేశం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించాలని తెరాస పథక రచన చేస్తోంది. ఇందుకోసం ఒక విస్తృత కార్యాచరణను రూపొందించింది. ఆరేళ్ల తెరాస ప్రస్థానంలో విద్యార్థులు పూర్తిస్థాయిలో క్రియాశీల పాత్ర పోషించిన సందర్భాలేవీ లేవు. వారు ఉద్యమంలోకి వస్తే ఉద్రిక్త సమయాల్లో హింసాకాండ చెలరేగవచ్చనీ, దాన్ని అదుపు చేయడం కష్టమనే భావన అధినేత కేసీఆర్‌లో ఉందని ఆ పార్టీ వర్గాలంటాయి. కానీ గ్రామస్థాయిలో పట్టును పదిల పరుచుకుని, పట్టణ ప్రాంతాల్లో విస్తరించడానికి విద్యార్థి శక్తి అత్యవసరమని తెరాస అధినాయకత్వం ఇప్పుడు గట్టిగా విశ్వసిస్తోంది. తెలంగాణలోని ప్రతి కళాశాలలోనూ పార్టీకి బలమైన విద్యార్థి విభాగం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస జిల్లాస్థాయి నేతలతో జరిపిన భేటీలో కేసీఆర్‌ ఈ మేరకు స్పష్టంగా నిర్దేశించారు. ఇంటర్‌ స్థాయి నుంచి ప్రతి కళాశాల ముందూ తెరాస పోస్టర్లుండాలని, పార్టీ జెండాను రెపరెపలాడించాలని వారికి సూచించారు. 'ఆరేళ్ల ఉద్యమంలో విద్యార్థుల పాత్రను మనం ఆశించలేదు. వారినెప్పుడూ తెరపైకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో వారి పాత్రను పెంచాల్సిన తరుణం వచ్చింది' అని ఆయన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జూనియర్‌ ఇంటర్‌ స్థాయి కళాశాలలోనూ పార్టీ కమిటీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారం రోజుల్లోఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. 'ప్రతి నాయకుడూ ప్రత్యక్షంగా కళాశాలకు వెళ్లాలి. 300 మంది విద్యార్థులుంటే 15 మందితో, అంతకు మించితే 24 మందితో కమిటీని ఏర్పాటు చేయాలి. వాటిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 51 శాతం ఉండేలా జాగ్రత్త వహించాలి' అని సూచించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు తెలంగాణ భవన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రంగాల ప్రముఖులు వారికి వివరిస్తారు. అనంతరం ప్రతి విద్యార్థీ కొన్ని వందల మందిని చైతన్యపరచాలని నిర్దేశిస్తారు. కరీంనగర్‌ ఉప ఎన్నికలో తన విజయంలో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారని, ఆ సమయంలో వారి శక్తియుక్తులు ప్రస్ఫుటంగా కన్పించాయని ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో కళాకారులతో ధూంధాం కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం 50 సీట్లతో ఒక పెద్ద బస్సును ప్రత్యేకంగా తయారు చేయించారు. లంబాడీలను కూడా ధూంధాంలో భాగస్వాములను చేయాలని పార్టీ నేతలను అధినేత నిర్దేశించారు.

గుర్జర్లలా ఉద్యమిస్తాం: కేసీఆర్‌ eenadu

610పై కేసీఆర్‌
మావారిని అడ్డుకుంటారా?
ఇలాగైతే తెలంగాణ అగ్నిగుండమే
వైఎస్‌ మాడి మసవుతాడు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 జీవో అమలు కోరుతూ సచివాలయ ముట్టడికి పలు జిల్లాల నుంచి తరలి వస్తున్న తమ కార్యకర్తల్ని ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. వారందరినీ తక్షణం విడిచి పెట్టని పక్షంలో తెలంగాణ అగ్నిగుండమవుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణతో పెట్టుకుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ మాడి మసవక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరిపైనో దాడిచేసే ఉద్దేశంతో తామీ పిలుపివ్వలేదని స్పష్టం చేశారు. సచివాలయం, అసెంబ్లీల ముట్టడి ముందునుంచీ ఉన్నదేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి పెద్దసంఖ్యలో ముస్లిం మైనారిటీలు ఆదివారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఇక్కడి తెలంగాణభవన్లో వారినుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. బిందుసేద్యం కోసం జారీచేసిన జీవో 34ను 'యమడేంజర్‌ జీవో'గా ఆయన అభివర్ణించారు. దాన్ని తక్షణం రద్దుచేయని పక్షంలో రాజస్థాన్‌లో గుజ్జర్ల మాదిరిగా తెలంగాణ అంతటా రోడ్లను దిగ్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలనను పూర్తిగా స్తంభింపజేస్తామన్నారు. 'చిట్టచివరి స్థానికేతర ఉద్యోగిని కూడా తెలంగాణ నుంచి పంపేదాకా విశ్రమించేది లేదు. తెలంగాణలో ఆంధ్ర పెత్తందార్ల పెత్తనాన్ని ఇకపై సహించబోం. 50 ఏళ్లుగా వారు తెలంగాణను లూటీ చేసిందిచాలు. తెలంగాణలో భూకబ్జాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పైగా హైదరాబాద్‌ ఎవడబ్బ సొమ్మని ఆంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ మా అబ్బ సొమ్మే. హైదరాబాద్‌ కోసం కిరికిరి చేయడానికి వారేమైనా మక్కా మసీదుకు పునాది తవ్వారా?'అని ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఐదారుగురు ముస్లిం మైనారిటీలకు మంత్రి పదవులతోపాటు 12 శాతం రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్పారు.

స్వరాష్ట్రంలోనే స్థానికేతరులమా? eenadu

మా పిల్లలు ఇక్కడే లోకల్‌
వారిని వదిలిపెట్టి ఎలా వెళ్లమంటారు?
ఇవన్నీ బలవంతపు బదిలీలే
610పై స్థానికేతర కానిస్టేబుళ్ల ఆరోపణ
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోల పేర్లు చెప్పి తమని బలవంతంగా హైదరాబాద్‌ నుంచి పంపిస్తున్నారని నగర పోలీసు విభాగంలోని కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. సరైన మార్గదర్శకాలు, నియమనిబంధనలు లేకుండా కేవలం కొందరు నేతల బ్లాక్‌మెయిల్‌కి ప్రభుత్వం తలొగ్గి తమకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నేపథ్యంలో బదిలీ కాబోతున్న దాదాపు 600 మంది కానిస్టేబుళ్లు ఆదివారమిక్కడ సమావేశమయ్యారు. ఎవరికి వారు ఈ బదిలీ ఉత్తర్వుల్ని న్యాయస్థానంలో సవాల్‌ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... ''1985 నుంచి గుర్తుకురాని 610 జీవో ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది. కేవలం కొందరు రాజకీయనాయకులు ఒత్తిళ్లకు తలొగ్గే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బదిలీ ఉత్తర్వులు సైతం అస్పష్టంగా ఉన్నాయి. సాధారణంగా వాటిపై డీఓ (డిపార్ట్‌మెంటల్‌ ఆర్డర్‌) నంబరు ఉంటుంది. అయితే ఈ అన్యాయమైన బదిలీలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఉండేందుకే డీఓ నంబర్లు లేకుండా ఉత్తర్వులు ఇస్తున్నారు. కానిస్టేబుళ్ల సొంత జిల్లాలకు సంబంధించి జోన్ల వారిగా జాబితాలు విడుదల చేసి కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేస్తున్నారు. సొంత జిల్లాలకు వెళ్లిన వారు అక్కడ ఎస్పీలకు రిపోర్ట్‌ చేసి తిరిగి హైదరాబాద్‌ రావచ్చంటూ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు. ఏళ్లకొద్దీ ఉన్న సర్వీసును కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అమెరికాలో సైతం కొన్నేళ్లుంటే అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అలాంటిది పక్క జిల్లాల నుంచి వచ్చి కొన్నేళ్లుగా ఇక్కడుంటున్న వారు స్థానికేతరులు ఎలా అవుతారు? మా పిల్లలు ఇక్కడ లోకల్‌... మరి వారిని విడిచిపెట్టి ఎలా వెళ్లాలి. హైదరాబాద్‌ని ఫ్రీజోన్‌ అని ప్రకటించిన తర్వాతే మేము దరఖాస్తు చేశాం. అలా పేర్కొని మమ్మల్ని తప్పుదోవ పట్టించిన వారిని ప్రాసిక్యూట్‌ చేయాలి. ఫ్రీజోన్‌గా ప్రకటించినప్పుడు ఈ తెలంగాణవాదులు ఏమయ్యారు? మేము వెళ్లిపోతున్నట్లే కేసీఆర్‌ సైతం తన నియోజకవర్గం సిద్ధిపేటకే పరిమితం కావాలి. 1973లో వచ్చిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రకారం నగర పోలీసులు, సచివాలయ ఉద్యోగులు 610 నుంచి మినహాయింపని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దాన్నీ బుట్టదాఖలు చేశారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌, హరీష్‌రావు, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల జాబితా సిద్ధం
నేడో రేపో ఉత్తర్వులు
610 జీవో నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో బదిలీలు పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఈ జీవో కింద నగర కమిషరేట్‌ నుంచి 2643 మంది తమ సొంత జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే 2 విడతలుగా 248మందిని బదిలీ చేశారు. మిగిలినవారి జాబితా సిద్ధం చేశారు. తూర్పు మండలంలో 198, దక్షిణ మండలంలో 332, మధ్య మండలంలో 213, ఉత్తర మండలంలో 283, పశ్చిమ మండలంలో 323, ట్రాఫిక్‌లో 318, సాయుధ దళంలో 586, స్పెషల్‌ బ్రాంచ్‌లో 60, సీసీఎస్‌లో 82 మంది బదిలీ కానున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమ, మంగళవారాల్లో వెలువడే అవకాశం ఉంది. తొలుత సొంత జిల్లాలకు బదిలీ చేసి, ఆ వెంటనే డిప్యుటేషన్‌పై తీసుకువస్తారని తెలుస్తోంది.

సొంత జిల్లాలకు టీచర్ల పయనం eenadu

రంగారెడ్డి జిల్లా: 610 జీవోకు అనుగుణంగా సొంత జిల్లాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకొన్న రంగారెడ్డి జిల్లాలోని 372 మంది ఉపాధ్యాయుల్లో 214 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ తమ జిల్లాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ మేరకు వారికి ఆదివారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన స్థానికేతర ఉపాధ్యాయులు.. కుటుంబ సభ్యులతో సహా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌లో ఉత్తర్వులు తీసుకుని అక్కడి నుంచే నేరుగా సొంత జిల్లాలకు వెళ్లేందుకు వారు ఇలా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, సామగ్రితో సహా వచ్చారు. దీంతో అక్కడ సందడిగా కనిపించింది. ప్రస్తుతం 610 జీవో అమలు తొలి దశలో భాగంగా స్వచ్ఛంద బదిలీలు జరుగుతున్నాయి.