బీఎన్ రెడ్డి కన్నుమూతతెలంగాణ పోరాటయోధుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్ రెడ్డి) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని గోల్నాకలో నివాసముంటున్న ఆయన గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్వల్పఅస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంబర్‌పేట శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు బీఎన్‌రెడ్డి మరణవార్త తెలియగానే పలువురు నాయకులు ఆయన ఇంటికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నల్గొండజిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ, లోక్‌సభ సభ్యుడు సురవరం సుధాకర్‌రెడ్డి, భాజపా జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనారెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ చుక్కారామయ్య, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకట్‌రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు ఆయన ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఎం కేంద్ర కమిటీ నేతలు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు తదితరులు సంతాపం తెలిపారు.
ఇదీ ప్రస్థానం: 1925లో నల్గొండజిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు రెండోసంతానంగా బి.ఎన్.రెడ్డి జన్మించారు. ఆయన సోదరుడు కుశలవరెడ్డికాగా సోదరీమణులు మల్లు స్వరాజ్యం, శశిరేఖ, సరస్వతమ్మలు. మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే బీఎన్‌రెడ్డి ఉద్యమాల బాటపట్టారు. 1945లో సరోజను వితంతు వివాహం చేసుకున్నారు. 1957, 1967లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 1971, 1984, 1991లో ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటుకు బస్సులోనే వెళ్లేవారు. 1975 నుంచి 1983 వరకు సీపీఎం జిల్లా కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1997లో సీపీఎంను వీడి బీఎన్ సీపీఎంను స్థాపించారు. అనంతరం ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐలోచేరారు. వందెకరాల సొంత భూమిని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఉద్యమాల వీరుడు.. పోరాటాలకు నిలువెత్తు రూపం. గోలుకొండా ఖిల్లా కింద నీ గోరి కడతం కొడుకో.. అని నైజాంను గర్జించినవాడు. భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయంగా తుపాకీ చేబట్టి పేదల పక్షాల నిలిచిన ధీరోదాత్తుడు. తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా సేనాని. సమసమాజం కోసం పాటుపడిన వ్యక్తి. 'దున్నేవాడిదే భూమిరా' అంటూ నినదించి.. వంద ఎకరాల తన భూమిని ప్రజలకు పంచిన త్యాగశీలి. సమరశీల పోరాటాలు రచించడంలో ఉద్ధండుడు. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి విస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముందున్న ధీశాలి. ఆయనే బి.ఎన్.రెడ్డిగా ప్రాచుర్యం పొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి.
నేపథ్యమిది.. నల్గొండ జిల్లా తుంగతుర్తి తాలూకా కొత్తగూడ గ్రామంలో ధనవంతుల కుటుంబంలో జన్మించినా.. ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమసమాజం వైపే. స్థానిక జమీందారుల నిరంకుశత్వానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం క్రమంగా నిజాం అరాచకాలపై వ్యతిరేక పోరుగా... ఆనక రాజకీయ ఉద్యమంగా మారింది. మొదటి దశకు ఆద్యుడైన రెండో తరం నేతలల్లో ముందు భాగాన ఉన్న బీఎన్... చివరి దశ వరకూ అలుపెరగని పోరాటం సాగించారు. వీర తెలంగాణ ఉద్యమ నేతలుగా రావి నారాయణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్ తదితరులుంటే... ఆరుట్ల రామచంద్రరెడ్డి, బీఎన్ రెడ్డి, కుర్రారం రామిరెడ్డి తదితరులు సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానులుగా ఉండి భూస్వాములకు, నిజాంకు వ్యతిరేకంగా పోరు సల్పారు. సాయుధ పోరాట సమన్వయానికి ఏడుగురి సభ్యులతో ఒక కమిటీ ఉంటే... దానికి కార్యదర్శిగా బీఎన్ ఉండేవారు. కమ్యూనిస్టులకు సహకరిస్తున్నావంటూ భూస్వామి విస్నూరు రామచంద్రారెడ్డి చాకలి ఐలమ్మపై కక్షగట్టారు. తన దగ్గర కౌలుదారుగా ఉన్న ఆమె పండించిన ధాన్యం బస్తాలను తీసుకుపోయి దాచేస్తే... భీంరెడ్డి స్వయంగా వెళ్లి ధాన్యం బస్తాలను భుజాన వేసుకుని తిరిగి ఐలమ్మకు అప్పగించారు. సూర్యాపేట భూపోరాటంలోనూ బీఎన్ సమరశీల పాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆ తర్వాత సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన సీపీఎం వైపునకు వెళ్లారు.
నల్గొండలో మాత్రం ఐక్యంగా ఉండాల్సిందే 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎన్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు. సమైక్యవాదంపై గట్టిగా నిలబడ్డారు. అప్పటికి రావి నారాయణరెడ్డి కూడా జీవించే ఉన్నారు. దేశమంతా కమ్యూనిస్టులు ఎలా ఉన్నా.. వామపక్షాల పురిటిగడ్డ నల్గొండలో మాత్రం కలిసే ఉండాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు ఐక్యంగా పనిచేయడంతో తెలంగాణ ఉద్యమ గాలిలో కూడా.. బీఎన్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం మూడుసార్లు మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెల్చిన ఆయన చివరి కోరిక కమ్యూనిస్టులను ఐక్యంగా చూడాలన్నదే. ఆయన చివరి రోజుల్లో కూడా సన్నిహితులతో ఇదే తన ఆఖరి కోరిక అని చెప్పేవారని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.
మూడుసార్లు ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే అయినా... రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా... గెలిచినా బీఎన్ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. అంతకాలం పదవుల్లో ఉన్నా ప్రజల కోసమే పనిచేశారు తప్ప... తనకోసం సంపాదించుకున్నది చిల్లిగవ్వ కూడా లేదు. పార్లమెంటు సమావేశాలకు ఆయన ఎప్పడూ బస్సులోనే వెళ్లేవారు. ఈ తరం రాజకీయ నేతలు అలాంటి నేతల జీవితాలనుంచి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎంతో ఉంది.
- న్యూస్‌టుడే, హైదరాబాద్, నల్గొండ




పీజేఆర్ విలక్షణ రాజకీయ నాయకుడు. సమస్యలతో రాజీ పడడం ఆయన నైజం కాదు. ఏ మాత్రం సర్దుకు పోయినా అందలం ఎక్కే అవకాశం ఉంటుందని తెలిసినా తాననుకున్న దానికే కట్టుబడ్డారు. తాను మంచి అనుకున్నదే చేస్తారు. దానివల్ల రాజకీయంగా తను నష్టపోయే పరిస్థితి ఉన్నా లెక్కపెట్టరు. ఆయనలోని ఈ మొండితనం ఆయన్ను అనేకసార్లు పదవులకు దూరం చేసిందని సన్నిహితులు అంటారు. 1994-99 మధ్య కాలంలో పీజేఆర్ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా పీజేఆర్ సమస్యలపై తన పోరాటం నుంచి పక్కకు తప్పుకోలేదు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ విపక్షంలో ఉండి వాగ్దానాలకు కట్టుబడాలని ఆయన పట్టుబట్టారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఐమ్యాక్స్, రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ ఆస్తుల వేలం, తదితర అనేక అంశాల్లో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వేసిన సభా సంఘాల్లో ఎక్కువ శాతం పీజేఆర్ డిమాండ్‌తో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు విషయంలో ఆయన సహ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డితో కలసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ శాసన సభ్యునిగా ఉంటూ ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ సమస్యపై ఆందోళనదశలోనే పీజేఆర్, శశిధర్‌రెడ్డిలను హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరు వచ్చింది. పోతిరెడ్డి పాడు అంశాన్ని పీజేఆర్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానివల్ల తెలంగాణాకు ముఖ్యంగా జంట నగరాల తాగునీటి అవసరాలకు ఇబ్బంది అవుతుందని వాదించారు. కాంగ్రెస్‌లో అసమ్మతినేతగా అంతా భావించినా ఆయనెప్పుడూ పార్టీ క్రమశిక్షణను తప్పకుండా సమస్యలపై మాత్రమే గళమెత్తారు. దాంతో పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఆయనతో చర్చలు జరిపేది. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్ డిమాండ్లతో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రత్యేకంగా ఒక ఇంజినీర్‌తో దానిపై అధ్యయనం చేయించారు. పోతిరెడ్డిపాడు వల్ల ఇబ్బంది లేదని ఇంజినీరు తేల్చారు. పార్టీలో ఒకనిర్ణయం తీసుకున్నాక కొందరికి ఆమోద యోగ్యం కాకున్నా కట్టుబడి ఉండాల్సిందేనన్న పార్టీ సూచన మేరకు దానికి కొంత విరామాన్నిచ్చారు. పోతిరెడ్డిపాడు వివాదానికి ముందు పీజేఆర్ ప్రత్యేక తెలంగాణా విషయంలో తన వైఖరిని ఎప్పుడూ బయట పెట్టలేదు. పోతిరెడ్డిపాడుపై పీజేఆర్ రాజీలేని పోరాటం చేయడంతో తెలంగాణా వాదుల్లో ఆయన్ను హీరోను చేసింది. అప్పటినుంచి ఆయన ప్రత్యేక వాదిగా ముద్రపడ్డారు. హైదరాబాద్ నగరానికి మూడో దశ కింద కృష్ణాజలాలనే రప్పించాలనేది ఆయన డిమాండ్. డిపెప్ కుంభకోణంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు పాత్రపై విచారణ కోసం పీజేఆర్ కొంతకాలంగా సభాసంఘం సమావేశాల్లో తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. సూరీడును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన రెండు రోజుల క్రితం సిఐడి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం గోదావరి నీటినితెచ్చే ప్రయత్నాల్లో ఉండడంతో దానిపై ఉద్యమం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

అర్ధరాత్రి తలుపు తట్టినా నేనున్నానంటూ ఆయన వెంట నడుస్తారు. జనం బాధను పంచుకుంటారు. కొండంత అండగా నిలబడతారు. ఆయన ఏ పదవిలో ఉన్నా నమ్మిన వారికి న్యాయం చేసేవరకు విశ్రమించరు. బడుగువర్గాలు, కార్మికులంటే ఎంతో ప్రేమ. పదవిలో ఉన్నా.. లేకున్నా.. ఆయనది రాజీలేని మనస్తత్వం. ఆయనే పబ్బతిరెడ్డి జనార్దనరెడ్డి. పీజేఆర్‌గా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువైన నేత. నగరంలో ఏమూల ఏపేదవాడికి ఏకష్టమొచ్చినా రెక్కలు కట్టుకుని వాలిపోయే జెన్నన్నను మృత్యువు మింగేసిందంటే జనం తట్టుకోలేకపోతున్నారు.


తరలివచ్చిన నేతలు పీజేఆర్ మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఆసుపత్రికి ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్, నేదురుమల్లి దంపతులు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇక్బాల్ సింగ్, కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు కొణిజేటి రోశయ్య, కొణతాల రామకృష్ణ, రఘువీరారెడ్డి, షబ్బీర్‌అలీ, డాక్టర్ గీతారెడ్డి, ముఖేష్, ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచందర్‌రావు, సీనియర్ నేతలు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరావు, కోదండరెడ్డి, ఎంపీలు వెంకటస్వామి, వి.హనుమంతరావు, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి, తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జి.సాయన్న, భాజపా నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, క్రైస్తవ మతప్రచారకుడు కె.ఎ.పాల్, సినీ ప్రముఖులు శ్రీహరి, ఎం.ఎస్.రెడ్డి, బాబూ మోహన్, కార్మిక సంఘాల నేతలు వచ్చారు.


