Friday, June 29, 2007

తెలంగాణలోనే ఉద్యోగులెక్కువ

ప్రణాళికా శాఖ లెక్కలివి
ప్రభుత్వ ఉద్యోగులు 12.99 లక్షలు
పీఎస్‌యూలలో 5.79% క్షీణత
స్థానిక సంస్థల్లో పెరిగారు
హైదరాబాద్‌లోనే 1,13,098
మొత్తం తెలంగాణలో 6,14,971
కోస్తా ఉద్యోగులు 4,63,610
సీమలో సిబ్బంది 2,20,473
ప్రణాళిక శాఖ లెక్కలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదల ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో తగ్గిన వారికన్నా ఎక్కువగా ఉంది. గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారు, కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతోసహా అందరినీ లెక్కించడం మరో విశేషం.
2006 మార్చినాటికి వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ), స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతరత్రా ప్రభుత్వంతో సంబంధమున్న విభాగాల్లో పని చేస్తున్న వారి వివరాల్ని ప్రణాళికా శాఖ సేకరించింది. అన్ని శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న వారందరి వివరాల్ని సంపూర్ణంగా సేకరించడం ఇదే ప్రథమం. మొత్తం 306 విభాగాల అధిపతుల నుంచి సమాచారం సేకరించారు. ఉద్యోగుల విద్యార్హత, ఉద్యోగంలో ఎప్పుడు ఏ హోదాలో చేరారు, అప్పట్లో జీతం ఎంత, ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు వంటి వివరాలన్నీ పొందుపరిచారు. ఈ వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దీని ప్రకారంపైన పేర్కొన్న అన్ని విభాగాల్లో కలిపి ఉద్యోగుల సంఖ్య 12,99,054. 2001లో సేకరించిన లెక్కల ప్రకారం అన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 12,28,170. ఈ మేరకు 70,884 మంది పెరిగినట్లు కనిపిస్తున్నారు. 2001లో న్యాయ శాఖ, లెజిస్లేచర్‌, దేవాలయాల్లో పనిచేస్తున్న వారి వివరాల్ని ప్రణాళిక శాఖ సేకరించలేదు. 2006 మార్చినాటి లెక్కల ప్రకారం ఆ మూడు విభాగాల్లో కలిపి 26,776 మంది ఉన్నారు. ఈ సంఖ్యను పక్కనపెడితే నికరంగా ఉద్యోగుల పెరుగుదల 44,108.
విభాగాల వారీగా పరిశీలిస్తే... ప్రస్తుతం నేరుగా ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారి సంఖ్య 6,06,019. 2001లో వీరి సంఖ్య 5,79,877. అంటే 26,142 మంది పెరిగినట్లు కనిపిస్తోంది. 2001లో న్యాయ, లెజిస్లేచర్‌, దేవాలయాల్లో పని చేస్తున్న వారిని లెక్కించలేదు కనుక 2006 లెక్కల్లో నుంచి కూడా ఈ విభాగాలను మినహాయిస్తే... ప్రస్తుతం నేరుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2001తో పోలిస్తే 634 తగ్గినట్లుగా తేలుతోంది. ఇక పీఎస్‌యూలలో సంస్కరణలు వేగంగా అమలు చేస్తుండటంతో వీటిలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2001లో ఈ సంస్థల్లో పని చేస్తున్న వారి సంఖ్య 2,98,752 ఉంటే 2006 నాటికి 2,52,943 మందే ఉన్నారు. అంటే అయిదేళ్ల వ్యవధిలో 45,809 మంది తగ్గిపోయారు. గృహ నిర్మాణ మండలిలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించగా... పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థతో సహా పలుపీఎస్‌యూలలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అమలు చేశారు. దీని ఫలితమే ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల. * విద్య, వైద్యం, పోలీసు శాఖలు మినహా ఇతర శాఖల్లో నియమాకాల సంఖ్య బాగా తక్కువ. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. * స్థానిక సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల మొత్తం సంఖ్యలో ఒకింత భారీ పెరుగుదలే కనిపిస్తోంది. * 12.99 లక్షల ఉద్యోగులకుగాను నేరుగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నది 6.06 లక్షల మంది (46.65 శాతం) * స్థానిక సంస్థల్లో పని చేస్తున్న వారి శాతం 26.07. * జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 2001 లెక్కలతో పోల్చితే 2006నాటికి పెరిగిన ఉద్యోగుల శాతం 5.79. * పీఎస్‌యూలలో ఐదేళ్ల వ్యవధిలో 3.84శాతం మంది ఉద్యోగులు తగ్గారు. * మొత్తం గెజిటెడ్‌ ఉద్యోగుల సంఖ్య 63,501 మాత్రమే. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులే 5,46,329 మంది ఉన్నారు. * శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా కేవలం 35,641 మంది ఉద్యోగులు ఉండగా.. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,13,098 మంది పని చేస్తున్నారు.
ఏ జిల్లాలో ఎందరు: ఆదిలాబాద్‌ - 68,559; నిజామాబాద్‌ - 40,325; కరీంనగర్‌ - 80,151; మెదక్‌ - 38,723; రంగారెడ్డి - 52,557; మహబూబ్‌నగర్‌ - 51,906; నల్గొండ - 46,372; వరంగల్‌ - 58,036; ఖమ్మం - 65,244; విజయనగరం - 36,872; విశాఖపట్నం - 52,548; తూర్పుగోదావరి - 69,557; పశ్చిమ గోదావరి - 52,730; కృష్ణా - 68,321; గుంటూరు - 59,117; ప్రకాశం - 42,125; నెల్లూరు - 46,699; కడప - 45,776; కర్నూలు - 52,758; అనంతపురం - 51,856; చిత్తూరు - 70,083.

No comments: