Tuesday, July 10, 2007

పీజే ఆర్‌ తనయుడు విడుదల andhrajyothi

సైదాబాద్‌, జూలై 10 (ఆన్‌లైన్‌): ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు పి.జనార్దన్‌రెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, అల్లుడు సంతోష్‌రెడ్డిలు మంగళవారం సాయంత్రం చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి బెయిల్‌ మంజూరైందన్న విషయాన్ని తెలుసుకున్న పీజేఆర్‌ మద్దతుదారులు, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు సుమారు 70 వాహనాల్లో భారీ ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు.
బెయిల్‌ మంజూరు పత్రాలు చంచల్‌గూడ జైలు అధికారులకు సాయంత్రం 5.45 గంటలకు అందించారు. వీరిద్దరిని 6.15 నిముషాలకు బయటకు పంపించారు. విష్ణువర్ధన్‌రెడ్డి జైలు గేటు నుంచి బయటకు రాగానే కాంగ్రెస్‌ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విష్ణును పూలదండలతో ముంచెత్తారు. నినాదాలు చేస్తూ ఉగ్వేదంతో ఊగిపోయారు. పెద్ద ఎత్తున రోడ్లపై కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో అరగంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కార్పియో వాహనంపై విష్ణును కూర్చోబెట్టి ఊరేగింపుగా తోడ్కొని వెళ్ళారు.


కక్షకట్టి కేసులో ఇరికించారు...
ప్రభుత్వం తమ కుటుంబంపై కక్షకకట్టి కేసులో ఇరికించారని పిజెఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన తల్లిని కారులో తోడ్కొని వెళుతున్న సందర్భంలో అకారణంగా వై ఎస్‌ రవీంద్రరెడ్డి, అతని కుమారుడు, కారులో ఉన్న మరో ఇద్దరు తమను తీవ్ర పదజాలంతో ధూషించి దాడిచేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై బెయిలబుల్‌ కేసు నమోదు చేసి తనపై 307 సెక్షన్‌ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తమకు మద్దతిస్తున్న ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు.

కెపిహెచ్‌బిలో వినూత్న నిరసన
కెపిహెచ్‌బి కాలనీ, జూలై10 (ఆన్‌లైన్‌) : పిజెఆర్‌ తనయుని విషయంలో న్యాయం తారుమారైందని ఎత్తి చూపుతూ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో పిజెఆర్‌ వర్గీయులు గొట్టిముక్కల దేశాల్‌ ఆధ్వర్యంలో వినూత్నంగా శాంతియుత నిరసనకు దిగారు. చెప్పులు చేతులకు తొడుక్కోవడంతో పాటు కాళ్లకు గడియారాలు ధరించి చొక్కాలను వెనుక వైపునకు వేసుకొని న్యాయం తారుమారైందని ఎత్తి చూపారు. ఇక్కడ వైఎస్‌ దిష్టిబొమ్మకు పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు
మీడియాలపై విరుచుకు పడడం,అక్రమ కేసులు బనాయించడం లాంటి పనులకు వైఎస్‌ పాల్పడుతున్నాడని ఆయన దిష్టిబొమ్మకు ఈ రకమైన సన్మానం చేసి తమ నిరసన తెలియజేస్తున్నట్లు దేశాల్‌ పేర్కొన్నారు. కూకట్‌పల్లి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కర్కె పెంటయ్య,వెంగళరావు, బ్రహ్మానంద్‌రెడ్డి తదితర నాయకులు నిరసన కార్యక్రమానికి విచ్చేసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నాయకులు రామాంజన్‌రెడ్డి,కళ్యాణ్‌ చక్రవర్తి,
రాందాస్‌,బాస్కర్‌,రమేష్‌,వెంకట్‌రెడ్డి,బాబు, అంజన్‌కుమార్‌ చౌదరి,టి. ఆర్‌.గౌడ్‌, ఎమ్‌.క్రిష్ణారావు పాల్గొన్నారు.
ఖైరతాబాద్‌లో ఆగని ఆందోళన

యూసుఫ్‌గూడ, జూలై 10 (ఆన్‌లైన్‌): జూబ్లీహిల్స్‌ సంఘటన పై పీజేఆర్‌ అనుచరులు, కాంగ్రెస్‌ నాయకుల, ఎన్‌ఎస్‌యుఐ నాయకుల ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. పోలీసులు వ్యవహరించిన తీరుపై, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కక్షసాధింపు చర్యలపై ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు చాలాచోట్ల నిరసన ప్రదర్శనలు చేశారు. ఎన్‌ఎస్‌యుఐ నాయకులు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చాలాచోట్ల కాంగ్రెస్‌ నాయకులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు. ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల పట్ల డిసిపి మధుసూదన్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో వాహనాల ర్యాలీలు నిర్వహించారు.

కళాశాలల బహిష్కరణ
సంజీవరెడ్డినగర్‌, అమీర్‌పేట, బేగంపేట, దోమల్‌గూడ, నారాయణగూడ తదితర ప్రాంతాలలో పీజేఆర్‌ యువసేన నాయకులతో పాటు ఎన్‌ఎస్‌యుఐ నాయకులు విష్ణువర్ధన్‌ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టింనందుకు నిరసనగా కళాశాలలను మూయించివేశారు. దోమల్‌గూడలోని ఎ.వి. కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి నిజాం కాలేజీ, నారాయణగూడ ప్రాంతంలోని కళాశాలలను మూయించివేసి ఎస్‌ఆర్‌నగర్‌ చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

No comments: