Saturday, July 14, 2007

రౌడీలకే కాదు.. మాకూ ఆయనే సీఎం! eenadu

307 కేసు పెట్టించింది కేవీపీ
కేసు ఎత్తివేతపై కోర్టుకెళతా
ఆమరణ దీక్ష చేసి తీరుతా
ఇంట్లోనే చేపడతా: పీజేఆర్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే


కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి శనివారం మరింత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''కాంగ్రెస్‌ నుంచి నా సస్పెన్షన్‌కు ముఖ్యమంతి కుట్రపన్నారు. 2002లో అప్పటి రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వాయలార్‌ రవి వచ్చినపుడు కూడా ఆయన తన ఉద్దేశపూర్వక చర్యల ద్వారా నన్ను సస్పెండ్‌ చేయించారు. ఇప్పుడూ అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలను సాగనివ్వను. అన్ని విషయాలూ సోనియా దృష్టికి తీసుకెళ్తాను'' అంటూ ఘాటుగా స్పందించారు. సోమవారం నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని.. ఇందులో ఎలాంటి మార్పులూ ఉండబోవని తేల్చిచెప్పారు. దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను విడుదలచేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయం కోసం, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమని ఉద్ఘాటించారు. గతంలో చెప్పినట్లు ఇందిరా పార్కువద్ద కాకుండా తన ఇంటిలోనే సోమవారం ఉదయం దీక్ష ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఉల్టా చోర్‌...
రాష్ట్రంలో పరిస్థితులపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పీజేఆర్‌ చెప్పారు. ''రాష్ట్రం మొత్తం దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలు బతకడమే కష్టమైపోయింది. పార్టీకి, ప్రజలకు నష్టం కలుగుతోందని.. పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను కూడా. ఆయన రౌడీలకే కాదు.. మాకు కూడా ముఖ్యమంత్రే కదా?'' అంటూ ఆగ్రహంగా స్పందించారు. పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తోసిపుచ్చి, కేసు ఎత్తివేయడాన్ని కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు తెలిపారు. ''మా ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసును రద్దు చేస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. కమిషనర్‌ పత్రికలకు ప్రకటన విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి? ఈ అంశంలో మమ్మల్ని కనీసం విచారించరా? మాకు నోటీసు కూడా ఇవ్వరా? 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ డాంటే' అంటే ఇదే'' అంటూ ఆయన మండిపడ్డారు.

మూడేళ్లుగా భరిస్తున్నా..
''ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు నా కుమారుడిపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టించారు. మేము ఇచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి.. తన సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు లేకుండా ముఖ్యమంత్రి చేసుకున్నారు'' అంటూ పీజేఆర్‌ తాజా ఆరోపణలు చేశారు. తనను మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా భరిస్తున్నానని చెప్పుకొచ్చారు.

వాళ్లనలా.. మమ్మల్నిలానా?
''గత ఏడాది ఆగస్టు 22న స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు కుమారుడు ఆదిత్య ప్రతాప్‌ ఇంటికి రాయలసీమ గూండాలొచ్చారు. ఆయన భార్యను కొట్టి, ఆయన్ను తుపాకితో బెదిరించి.. నార్సింగ్‌ వద్ద ఉన్న భూములు అమ్మాలని హెచ్చరించారు. దీనిపై ఆరోజే కేసు పెడితే 307 సెక్షన్‌తోసహా పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. రాయలసీమకు చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తితోబాటు మరికొందరు ఈ సంఘటనకు బాధ్యులని పోలీసులే తేల్చారు. కానీ నిందితులను మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అదే మాపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలోనైతే.. అప్పటికప్పుడు అరెస్టు చేసి జైలుకూ పంపేస్తారా'' అంటూ పీజేఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

అమ్ముకోవడమే పనా: ''ఔటర్‌ రింగురోడ్డును మూడుసార్లు మార్చారు. పేదల భూములను అతి తక్కువ ధరలకు బలవంతంగా తీసుకుని ప్రభుత్వమే కంపెనీలకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటే ఎలా? ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం ఒక్కో ఎకరం రూ.6.5 లక్షలు చొప్పున తీసుకుని ప్రభుత్వం రూ.29 లక్షలకు అమ్ముకుంది. ఆనక ఆ సంస్థవాళ్లేమో వెయ్యి గజాలను పది కోట్లకు అమ్ముకున్నారు'' అని పీజేఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నేనే తొలి ఓటు వేస్తా: రాష్ట్రపతి ఎన్నికల్లో తానే మొదటి ఓటు వేస్తానని పీజేఆర్‌ చెప్పారు. ''మాది ధర్మ పోరాటం. దీనికి సైన్యంతో పని లేదు. ధర్మంతోనే పని'' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందని అడగ్గా 2009 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు.

No comments: