Wednesday, September 19, 2007

అభివృద్ధి అవినీతిలోనే పార్టీపై 'సమాల్‌' ప్రభావం

గోనె ఆరోపణలు సీఎల్‌పీ కార్యాలయ కుట్ర

రెండో ఎస్సార్సీకి పార్టీ కట్టుబడి లేదు టీఆర్‌సీసీసీలో పదవుల యావ
'న్యూస్‌టుడే' ఇంటర్య్వూలో మధుయాష్కీ


నిజామాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుగౌడ్‌ యాష్కీ ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చిన యాష్కీతో 'న్యూస్‌టుడే' ముఖాముఖి...

ప్రశ్న: సమాల్‌ నివేదిక ప్రభావం ఎలా ఉంటుందంటారు?

జవాబు: ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్‌ ఉన్నతాధికారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలి. ఎదురు దాడి సరి కాదు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళా. పార్టీపైనా దీని ప్రభావం ఉండదనుకోవడం సరికాదు.

ప్ర: పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు?
జ: తెలంగాణపై మాట్లాడితే పార్టీని వ్యతిరేకించినట్లు కాదు. తెలంగాణ విషయంలో రాష్ట్ర నాయకత్వం వాస్తవాలను దాస్తోంది. అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తోంది. ఇది సరికాదు.

ప్ర: మీ వ్యవహారశైలి పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు మీ వ్యూహం ఏమిటి?

జ: నాకు ఏ వ్యాపారాలూ లేవు. వృత్తిపరంగా నైపుణ్యం చాటుకొన్న తర్వాత ఒక నిబద్ధతతో, నా సామాజిక బాధ్యత గుర్తిస్తూ రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు నాకు తెరాస, తెదేపా, భాజపాలు టికెట్టు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. సోనియా స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరా. ప్రజలను మోసంచేయడం, పార్టీకి వెన్నుపోటు పొడవడం లాంటివి నేను చేయడంలేదు. ప్రజల నిజమైన అభిప్రాయాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళుతున్నా.

ప్ర: పార్టీని వీడిపోతారనే ప్రచారం?

జ: కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.

ప్ర: ఈసారి మీకు టికెట్టు రాదని, అందుకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చర్చ?

జ: కుహనా విధేయుల వ్యాఖ్యలివి. పార్టీ క్రమశిక్షణకు లోబడే ఉంటున్నా. నా పనితీరు గుర్తించిన అధిష్ఠానం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.

ప్ర: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉంది. మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?

జ: రెండో ఎస్సార్సీకి కట్టుబడి లేదు. కనీస ఉమ్మడి ప్రణాళిక(సి.ఎం.పి)లో చేర్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చారు. రెండో ఎస్సార్సీ అంటే ఎలా? ప్రైవేటుగా తెలంగాణా కావాలనే వారు అధిష్ఠానం దగ్గరికి వెళ్లినపుడు మాత్రం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తద్వారా ప్రధానికి తప్పుడు సంకేతాలు అందిస్తున్నారు.
ప్ర: టీఆర్‌సీసీసీ ఉన్నా ఇతర వేదికల్లో పాల్గొనడం ఎందుకు?
జ: తెరాస కన్నా ముందే టీఆర్‌సీసీ ఏర్పడింది. ఎన్నికల తర్వాత సీనియర్‌ నాయకులు తెలంగాణ అంశాన్ని విస్మరించారు. పదవుల కోసం, వ్యక్తిగత లాభాలకోసం దీన్ని పక్కన పెట్టారు. గతంలో సీఎంను తీవ్ర పదజాలంతో విమర్శించిన వారే అభివృద్ధి పేరుతో తప్పుదోవ పట్టించారు. తెలంగాణా సాధన కోసం ఏ వేదిక అయినా సరే. కలిసి పోరాడాల్సిందే.
ప్ర: తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్న వాదన వచ్చింది కదా?
జ: అభివృద్ధి ఎక్కడ జరిగింది? అవినీతి అక్రమాల్లోనా? అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నిధులెక్కడ ఇస్తున్నారు? తెలంగాణా విశ్వ విద్యాలయమే దీనికి ఉదాహరణ. అభివృద్ధి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకువెళ్ళాం. నిజామాబాద్‌ జిల్లాలో తెదేపా కన్నా 10 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. గతం కంటే కొంత మెరుగై ఉండవచ్చు.
ప్ర: ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు మీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు?
జ: దీని వెనకాల తెలంగాణను వ్యతిరేకించే లాబీ ఉంది. కాంగ్రెస్‌లోని పెద్దలు, సీఎల్‌పీ కార్యాలయం, మీడియా కో-ఆర్డినేటర్‌ కుట్ర ఉంది. నా నోరు మూయించేందుకు బెదిరింపు ఇది. నా జీవితం తెరచిన పుస్తకమే. మొత్తం వెబ్‌సైట్‌లో ఉంది. దీనిపైనా అధిష్ఠానానికి మొత్తం వివరించాను.
ప్ర: ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునివ్వడం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది కదా?
జ: గత ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర అంశంతోనే గెలుపొందాం. ఏ పార్టీ వారైనా తెలంగాణాను ఏమి చేశారని ప్రశ్నించాలని చెప్పా. సామరస్యంగా శాంతియుతంగానే నిలదీయాలని పిలుపునిచ్చా. కేవలం కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే కాదు, అందరినీ.

No comments: