Wednesday, October 3, 2007

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే! Eenadu

సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజల బతుకులు..

దుబాయి.. ముంబయి.. బొగ్గుబావే!

వైఎస్‌, చంద్రబాబు రాజకీయ బేహారులు

పొత్తులుండవ్‌, ఒంటరిగానే పోటీచేస్తాం

తెలంగాణ వస్తే ఉపముఖ్యమంత్రి ముస్లిమే:

కేసీఆర్‌

'స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో అధికశాతం రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే తెలంగాణా (హైదరాబాద్‌ రాష్ట్రం) రూ.63కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంది. సమైక్యాంధ్ర ఏర్పడ్డాక, వలస పాలకుల దోపిడీతో తెలంగాణా సంక్షోభంలో కూరుకుపోయింది. అంటే తెలంగాణా వెనుకబడ్డది కాదు.. వెనకవేయబడ్డది'. 'తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక ముస్లింలకు డిప్యూటీ సీఎంతోపాటూ.. నాలుగు మంత్రి పదవులు ఇస్తాం. ఒక లోక్‌సభ, మరొక రాజ్యసభ స్థానాలను కేటాయిస్తాం. విద్యా, ఉద్యోగాల్లో 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తాం'.
- కేసీఆర్‌

కరీంనగర్‌ - న్యూస్‌టుడే
మధ్యంతర ఎన్నికల ఉరిమిపాటుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చెల్లక సీఎం వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబులు జనాకర్షక మంత్రాలను జపిస్తున్నారని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'తెలంగాణా ద్రోహుల పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు.. నమ్మక ద్రోహులపార్టీకి చెందిన సీఎం వైఎస్‌లకు తెలంగాణాలో తిరిగే హక్కే లేద'ని పేర్కొన్నారు. వీరిద్దరూ రాజకీయ వ్యాపారులని ఆరోపించారు. 'రూ.రెండుకే కిలో బియ్యం ఇస్తామని వైఎస్‌ చెబుతున్నారు. మూడున్నరేళ్లుగా ఆయన ఏం చేశారు. పేదలు ఇప్పుడే గుర్తుకొచ్చారా. ఇది ఎన్నికల గిమ్మిక్కుకాదా'ని కేసీఆర్‌నిలదీశారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించాక ఉచితవిద్యుత్తు ఫైలుపై సంతకం పెడితే..అది ఉత్త విద్యుత్తుగానే మిగిలిపోయిందని విమర్శించారు. 'తొమ్మిదేళ్లు సీఎంగా ఊరేగిన చంద్రబాబు.. సేద్యమే దండగన్నడు. విద్యుత్తు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టి.. జైళ్లలో తోయించిండ'ని మండిపడ్డారు. 'వైఎస్‌.. చంద్రబాబులు దొందూ దొందే. ఫార్ములావన్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు తెలంగాణా భూములను చంద్రబాబు అప్పగిస్తే.. ల్యాంకో, టాటా, బిర్లా, అంబానీలకు వైఎస్‌ తెగనమ్ముతున్నరు' అని దుయ్యబట్టారు. 'చంద్రబాబు, వైఎస్‌ల పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు, దుబాయి ముంబయి బొగ్గుబాయిగా మారాయ'ని ఆవేదన వ్యక్తంచేశారు. 'స్వంత పాలనలో తెలంగాణాలో బతుకులు బంగారం అవుతాయి. తెలంగాణా ప్రజలు దీన్ని గుర్తించాల'ని సూచించారు.
బోగస్‌ యజ్ఞం: 'వైఎస్‌ చేస్తున్న జలయజ్ఞం.. ఒట్టి బోగస్‌. తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే. వాటిని నడపడానికి 2500 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇప్పుడు సేద్యానికి ఏడు గంటలని చెప్పి.. ఐదుగంటలు కూడా ఇస్తలేరు. ఇక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తును ఎక్కడనుంచి తెస్తారు? ఈ ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణాకు నీళ్లిచ్చేందుకుకాదు. కాంట్రాక్టర్ల నుంచి పర్శంటేజీలు దండుకునేందుకే' అని కేసీఆర్‌ విమర్శించారు. 'మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు.. తెరాస ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అభీష్టం మేరకే ఒంటరిగానే బరిలోకి దిగుతామ'ని చెప్పారు.


No comments: