Friday, July 6, 2007

నెలాఖర్లోగా జాబితా eenadu

20% ఓపెన్‌ కేటగిరిగా పరిగణించాలి
1975 నుంచీ నియామకాల పరిశీలన
సత్వరమే డెప్యుటేషన్ల రద్దు
610పై హరినారాయణ ఆదేశాలు
రికార్డుల్లేవన్న అధికారులు
మరో 70 మంది కానిస్టేబుళ్ల బదిలీ

రాష్ట్రంలో 610 జీవో అమలు కోసం... 1975 నుంచీ జరిగిన నియామకాలను పరిశీలించి, అందులో స్థానికేతరుల జాబితాను నెలాఖరుకు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.హరినారాయణ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. డెప్యుటేషన్లను వెంటనే రద్దు చేసి, ఆయా అభ్యర్థులను వారి సొంత ప్రాంతాలకు పంపించాలన్నారు. 610 జీవో అమలుపై గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''610ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాంశంగాపరిగణిస్తోంది. దీని అమలుకు అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 1975 నుంచీ జరిగిన నియామకాల్లో జిల్లా స్థాయి పోస్టుల్లో 20 శాతాన్ని ఓపెన్‌ కోటా కింద పరిగణించి అవి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా అనేది పరిశీలించాలి. మిగతా 80 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ అయ్యాయా, లేదా చూడాలి. ఓపెన్‌ కేటగిరీ స్థానికేతరుల కేటగిరీ అనే భావన ఉంటే దానిని మీ మనసులోంచి తొలగించండి'' అంటూ ఉద్బోధించారు. జోనల్‌, కొన్ని గెజిటెడ్‌ పోస్టుల భర్తీ 30:70, 40:60 ప్రాతిపదికగా జరిగిందీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ''1975 నుంచి విద్య, వైద్య, పోలీసు శాఖల్లో దాదాపు ప్రతి ఏటా నియామకాలు జరిగాయి. ఇతర శాఖల్లో 8 నుంచి 9 దఫాల నియామకాలు జరిపారు. కొన్ని నియామకాల్లో ఓపెన్‌ కేటగిరీని స్థానికేతరుల కోటాగా పరిగణించి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అలాంటివారిని గుర్తించి సొంత జిల్లాలకు పంపాల్సిఉంది'' అని చెప్పారు.
గెజిటెడ్‌ కేటగిరీలో
స్థానికులకు కేటాయించిన పోస్టుల్లో ఇతర ప్రాంతాల వారిని డెప్యుటేషన్‌పై నియమించడం అక్రమమంటూ, వారిని వెంటనే వెనక్కి పంపాలని హరినారాయణ ఆదేశించారు. కొన్ని గెజిటెడ్‌ పోస్టుల విషయంలో సంబంధిత అధికారులు పనిచేసే పోస్టు స్థానిక కేటగిరీలోనిది అయితేనే ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. ఆ పోస్టు ఓపెన్‌ లేదా రాష్ట్రస్థాయి కేటగిరి పరిధిలోనిది అయితే మినహాయించాలని ఆయన అన్నట్లు తెలిసింది. జీవో అమలుకు సంబంధించి మరికొన్ని మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో జారీ చేస్తామని ఆయన చెప్పారు.
రికార్డులుంటేగా?
1975 నుంచి ఉద్యోగ నియామాలకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవంటూ ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు హరినారాయణకు వివరించారు. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ గౌతంకుమార్‌ మాట్లాడుతూ... గడిచిన నాలుగైదు దఫాలవి మినహాయిస్తే ఇతర నియామకాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని వివరించినట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో జరిగిన నియామకాలకు సంబంధించి రికార్డులు సేకరించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... అందుబాటులో ఉన్న వివరాలను పరిగణనలోనికి తీసుకొని జాబితాలు రూపొందించాలని సూచించారు.
మరిన్ని బదిలీలు
610 జీవో అమలులో భాగంగా స్వస్థలాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్న మరో 70 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ బల్వీందర్‌ సింగ్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కమిషనరేట్‌ నుంచి రెండు దఫాలుగా 248 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు.
డెప్యుటేషన్లలో ఆర్మీ, నేవీలకు మినహాయింపు
కారుణ్య పోస్టులకూ 610 వర్తింపు
కారుణ్య, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ (ఆరోగ్యపరమైన అనర్హత) కేటగిరీ నియామకాలకు సంబంధించి కూడా 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డెప్యుటేషన్ల రద్దులో ఆర్మీ, నేవీ ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని తీర్మానించింది. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ ఈ మేరకు సంకేతాలను అందించారు. ''దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, నేవీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం. హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాముల విషయమై ప్రత్యేక జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. దానికి అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం'' అని చెప్పారు. కారుణ్య, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ విభాగాల్లో జరిగిన నియామకాల గురించి ప్రస్తావిస్తూ... వాటినీ స్థానిక, స్థానికేతర కేటగిరీగా విభజించి ప్రత్యేక జాబితా రూపొందించాలని ఆయన ఆదేశించారు. వాటిపైనా త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

No comments: