Saturday, June 30, 2007

610 జీవోకు నీళ్లొదిలిని వాటర్‌ బోర్డు andhra jyothi

ఆన్‌లైన్‌,సిటీబ్యూరో హైదరాబాద్‌,జూన్‌29 : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న జీవో.610 అమలు నగరంలోని మెట్రోవాటర్‌బోర్డులో మాత్రం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం పై అధికారులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏళ్లతరబడి ప్రమోషన్‌లు లేక పోగా ఇతర జోన్‌లకు చెందిన వారిని వెంటనే వారి జోన్‌లకు పంపించడంలో ఉన్నతాధికారుల తీరు పై పలువురు ఇంజనీర్లు అసంతృప్తితో వున్నారు. అన్ని శాఖల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ తీర్మానించింది. అందుకు తగ్గట్టుగా మంత్రి డి.శ్రీనివాస్‌ కూడా ఈ నెలాఖరు వరకూ అన్ని శాఖల్లో కూడా రాష్ట్ర పతి ఉత్తర్వులకు అనుగుణంగా ఇతర జోన్‌లకు చెందిన వారిని వెంటనే వారిజోన్‌లకు పంపించి వేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గ ఉత్తర్వులను కూడా అన్ని శాఖలకు పంచించినట్టు తెలిపారు.
ఇంత జరుగుతున్నా ఇప్పటికీ వాటర్‌బోర్డు పెద్దతలకాయలను కదిలించడంలో ఉన్నత స్థాయిలో వస్తున్న ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నట్టు సమాచారం. ఇవే విషయంలో పలువురు ఇంజనీర్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు సిద్దమవుతున్నారు. జీవో.610 అమలుచేయాలని కొన్నినెలల క్రితం ముఖ్యమంత్రి ఆదేశించినా వాటర్‌బోర్డులో ఇప్పటికీ కొద్దిమందిని మాత్రమే పంపించి వేశారు. కానీ రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఇతర జోన్‌లకుచెందిన వారిని, 1989లో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు బోర్డుకు ఆప్షన్‌ ఇవ్వని వారిని వెంటనే వారి ప్రాంతాలకు పంపించాలని ఇంజనీర్లు గతకొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. బోర్డు ఏర్పాటు చేసినప్పుడు డిప్యుటేషన్‌ పై వచ్చిన వారిలో పలువురు అధికారులు ఇప్పటికీ బోర్డులోనే వున్నారని అన్నారు. బోర్డు సర్వీసెస్‌ రెగ్యులర్‌చేసినప్పుడు కొందరు అధికారులను బోర్డులో సర్వీసులోకి అబ్జార్వ్‌ చేసుకోలేదు. దీంతో వీరిలో చాలా మంది డిప్యూటేషన్‌ పై కొనసాగుతున్నట్టు లెక్క.
ఇటీవల మరో కొత్త వాదన బోర్డులో వినిపిస్తోంది. జీ.వో. 610 అమలు కేవలం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌స్థాయికేడర్‌ వరకూ పరిమితం అవుతుందని అన్నారు. ఉన్నతస్థాయి పోస్టులు ఈ జీవో పరిధిలోకి రావని అంటున్నారు. అయితే 1985లో వెలువడిన ఈ జీవోను 1989 నాడు బోర్డులో వున్న ఇతర జోన్‌లకుచెందిన అధికారుల హోదాను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌చేస్తున్నారు. అప్పట్లో చిన్నస్థాయిలో వచ్చిన అధికారుల్లో చాలా మంది తమ మాతృసంస్థ అయిన పబ్లిక్‌హెల్త్‌ నుంచి ప్రమోషన్‌లు పొందడం, తిరిగి ఆ హోదానే బోర్డులో అనుభవిస్తున్నారని ఇంజనీర్లు వాపోతున్నారు. మెట్రోవాటర్‌బోర్డు స్థానిక సంస్థల పరిధిలోకి వస్తుందని అందుకు అనుగుణంగా ఇతర జోన్‌లకుచెందిన వారెవరూ ఇక్కడ పనిచేయడానికి అర్హులు కాదని రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో స్పష్టం వుంది. కాబట్టి బోర్డుకు జీవో.610 ఖచ్చితంగా వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఇతరజోన్‌లకుచెందిన అధికారుల్లో ఎం.రామ్‌మోహన్‌రెడ్డి (సిజి ఎం), పి.మనోహర్‌బాబు (సిజి ఎం), సివి రాంబాబా (సిజి ఎం), సి.విజయ్‌కుమార్‌ (జనరల్‌ మేనేజర్‌), ఎం.సత్యనారాయణ(జనరల్‌ మేనేజర్‌), ఎంబి బేగ్‌(జనరల్‌ మేనేజర్‌) వంటివారు కొనసాగుతున్నారు. ప్రస్తుతం బోర్డులో వున్నఅనేక మంది అధికారుల్లో సీనియారిటీ వున్నా ఇప్పటికీ ప్రమోషన్‌లు రాకుండా వున్నారు. తమకన్నా జూనియర్లకు ప్రమోషన్లు ఇవ్వడం పై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్‌లు ఇచ్చేప్పుడు డిపిసి(డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) లేకుండానే నేరుగా ఇవ్వడం వల్ల చాలా మంది సీనియర్లు తమకున్న అర్హతలను గుర్తించడం లేదని వాపోతున్నారు.

No comments: