Saturday, June 30, 2007

ఏకీకృతానికి 610 ముళ్లు! eenadu

బదిలీల జీవోతో గందరగోళం
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
పొరపాటా? ఉద్దేశపూర్వకమా?
తెరపైకి మళ్లీ 'విడివిడి సర్వీస్‌'
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 జీవో అమలు పేరిట 229 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో.. లక్షల మంది ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఏకీకృత సర్వీస్‌కే ఎసరు పెట్టబోతోందా?పొరపాటా..ఉద్దేశపూర్వకమా అన్నది పక్కనపెడితే.. ఈ జీవో తమ దీర్ఘకాలిక పోరాటానికి గండి కొడుతోందని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. 'పంచాయత్‌రాజ్‌ టీచర్లు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారికి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆయనే పోస్టింగులిస్తారు. ప్రభుత్వ టీచర్లు జిల్లా విద్యాధికారికి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. వీరిని వారి వారి సంబంధిత లోకల్‌ కేడర్లకు బదిలీ చేస్తున్నాం' అని తాజా జీవో పేర్కొంటోంది. అంటే ఒకరకంగా ప్రభుత్వమే టీచర్ల విడివిడి సర్వీస్‌ను గుర్తించిందన్నమాట! ఒకవైపు 1998 నుంచి ఏదో ఒక పేరుతో ప్రభుత్వమే ఉమ్మడి సర్వీస్‌ను అమలు చేస్తూ.. సుప్రీంకోర్టులోనూ పోరాడుతూ.. రాష్ట్రపతి ఉత్తర్వులకే సవరణ కావాలని కోరుతూ.. ఇంకోవైపు తనే విడివిడి సర్వీస్‌ను తెరపైకి తీసుకురావడం కుట్రేనని పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరెడ్డి, రవికిరణ్‌ ఆరోపించారు. ఏకీకృతానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ టీచర్లు దీన్ని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది. అంటే చేజేతులా ప్రభుత్వమే వారికి అస్త్రాన్ని ఇచ్చినట్లేనని ఎస్‌టీయూ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు కత్తి నర్సింహారెడ్డి, లక్ష్మణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వ్యతిరేకిస్తున్నట్లు యూటీఎఫ్‌ పేర్కొంది. 'ఏకీకృత సర్వీసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒకరకంగా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లే లెక్క. ఇది హర్షణీయం. ఏకీకృత యత్నాలకు పూర్తిగా తెరవేసి.. ఇదే స్ఫూర్తి బదిలీలు, పదోన్నతులు, నియామకాలకూ వర్తింపజేయాలి' అని ప్రభుత్వ టీచర్ల సంఘం పేర్కొంది. ఈనెల 9న మంత్రి, ఉన్నతాధికారులు, సంఘాల నేతలతో ఢిల్లీ వెళ్లి... అక్కడే తిష్ఠ వేసి ఏకీకృత ప్రయత్నాలు చేద్దామని శుక్రవారమే నిర్ణయం తీసుకోగా, శనివారమే ఆ స్ఫూర్తికి గండి కొట్టేలా ఆదేశాలు రావడం విశేషం.

No comments: