Thursday, July 12, 2007

కొన్ని గెజిటెడ్‌ పోస్టులకూ 610 eenadu

వంద శాఖాధిపతుల ఆఫీసులకు కూడా
ప్రభుత్వం అంగీకరించింది
ఉత్తమ్‌కుమార్‌ వెల్లడి

నాన్‌ గెజిటెడ్‌ నుంచి గెజిటెడ్‌గా మారిన పోస్టుల్లోనూ 610 అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 1975 తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ జరిగిన నియామకాలన్నింటినీ సరిచేయాలని నిశ్చయించింది. ఈ జీవోపై ఏర్పాటైన శాసనసభా సంఘం ఛైర్మన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాలు ప్రకటించారు. సభాసంఘం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై, జీవో అమలును సమీక్షించింది. ''అదనంగా సృష్టించిన వంద పైచిలుకు శాఖాధిపతుల కార్యాలయాలను మళ్లీ జోనల్‌ పరిధిలోకి తేవాలి. వాటిలోనూ 610 జీవోను అమలు చేయాలి. దీనిపై ఏమి చర్యలు తీసుకున్నదీ వారంలోగా నివేదిక ఇవ్వాలి. న్యాయశాఖకూ దీన్ని వర్తింపజేయాలి. ఈ జీవోపై కాంగ్రెస్‌ ఎంపీలు హైకోర్టులో వేసిన కేసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం గట్టిగా వాదించాలి. 610 సంబంధిత కేసులన్నింటిలోనూ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ స్వయంగా వాదనలు వినిపించాలి. సభాసంఘం తదుపరి భేటీకి ఆయన కూడా హాజరవ్వాలి. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో ఉండి, అనంతరం గెజిటెడ్‌గా మారిన పోస్టులకూ ఈ జీవోను వర్తింపజేయాలి. స్వచ్ఛందంగా స్వస్థలాలకు వెళ్లదలచుకున్న స్థానికేతర ఉపాధ్యాయులందరి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించాలి. బదిలీ చేసిన ఉద్యోగులను తక్షణం రిలీవ్‌ చేయాలి'' అంటూ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం తర్వాత ఉత్తమ్‌కుమార్‌ విలేఖరులతో మాట్లాడారు. న్యాయ, ఆదాయపు పన్ను శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లో మొత్తం 6,714 మంది స్థానికేతర ఉద్యోగులను ఇప్పటిదాకా గుర్తించినట్టు చెప్పారు. పోలీసు శాఖలో 2,406 మంది ఉన్నారన్నారు. ''అయితే ఇవి 20 శాతాన్ని స్థానికేతర కోటా (సీలింగ్‌) గా భావించి సేకరించిన వివరాలు. సీలింగ్‌ను తీసేస్తే ఈ సంఖ్య పెరగవచ్చు. కానీ కొన్ని పార్టీలు చెబుతున్నట్టు అది లక్ష దాకా ఉండే అవకాశం మాత్రం లేదు'' అని ఆయన వివరించారు. 5, 6 జోన్లలోని ప్రభుత్వోద్యోగుల స్థానికత వివరాలను త్వరలో వెబ్‌సైట్లో ఉంచి, అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించారు. ఇకనుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని నియామకాల్లో 610ని అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. విశ్వవిద్యాలయాలకూ వర్తింపజేయాలని తాము సూచించామన్నారు. కాగా 610 అమలులో అధికారులు, ప్రభుత్వం తీరుపై సభాసంఘం సభ్యులు పెదవి విరిచారు. దీన్ని సమగ్రంగా ఆచరణలోకి తేవాలంటూ తామూ కోర్టుకెళ్తామని ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తెలిపారు. ఇతర సభ్యుల అభిప్రాయాలు వారిమాటల్లోనే..
నాలుగడుగులు వెనక్కి: దేవేందర్‌ గౌడ్‌ (తెదేపా)
610 అమలు రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు చందంగా జరుగుతోంది. జీవో అమలు కాకుండా ప్రభుత్వం ప్రతిదానికీ మసిపూసి మారేడుకాయ చేస్తోంది. చివరికి సభాసంఘం పని స్వచ్ఛంద బదిలీలను పర్యవేక్షించే వ్యవహారంగా మారుతోంది. 610 అమలు ఆగకుండా కోర్టులో కెవియట్‌ వేయాలంటే సమాధానం లేదు. అధికారుల్లోనూ అంతా అయోమయం, అస్పష్టత. న్యాయపరంగా చిక్కులున్న అంశాలకు చర్చను పరిమితంచేసి, అర్థరహితంగా మార్చారు.

ముల్కీ అమలు చేయాలి: పీజేఆర్‌ (కాంగ్రెస్‌)
ఈ జీవో సమస్య ఉద్యోగుల పరిధి దాటి ప్రజల దాకా వెళ్లింది. పలు కాలనీల్లో స్థానిక, స్థానికేతర విభేదాలు తలెత్తుతున్నాయి. ఇది నానాటికీ ముదిరి ఇండియా- పాకిస్థాన్‌ గొడవ మాదిరిగా తయారవుతోంది. జీవో అమలులో ఎన్నో చిక్కులు వస్తున్నాయి. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ మాట కూడా వినకుండా మా ఎంపీలు కొందరు దీనిపై కోర్టుకు వెళ్లారు. మరి ప్రభుత్వం, సభాసంఘం, మంత్రివర్గం, వైఎస్‌ ఏం చేస్తున్నట్టు? దీనిపై కెవియట్‌ ఎందుకు వేయడం లేదు? అధికారులను అడిగితే షరామామూలుగా 'ప్రాసెస్‌లో' ఉందంటున్నారు. జీవో స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలోనే ఆరో జోన్‌ నుంచి ఐదో జోన్‌కు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నారు. అందువల్ల దీనికి బదులు తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నట్టుగా ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. దీనిపై వైఎస్‌ ఆలోచించడం మంచిది.

వారే హీరోలూ, విలన్లూ: జూలకంటి రంగారెడ్డి (సీపీఎం)
610 విషయంలో కాంగ్రెస్‌ నేతలే హీరోలుగా, విలన్లుగా వ్యవహరిస్తున్నారు. అమలు చేయాల్సిందేనని కొందరు, అస్సలు కూడదని మరికొందరు వాదిస్తున్నారు. శాఖలవారీగా స్థానికేతర ఉద్యోగుల సంఖ్య, పేర్ల జాబితాను ఈ భేటీలో సమర్పించాలని, ఇంటర్‌నెట్లో కూడా పెట్టాలని క్రితంసారి సూచిస్తే అధికారులు స్పందించలేదు. గిర్‌గ్లానీ సిఫార్సులను పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి.

సమన్వయమేది: హరీశ్‌రావు (తెరాస)
610 అమలులో అధికారుల మధ్య సమన్వయమే లేదు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం పరిమితికి మించిన స్థానికేతరులను మాత్రమే పంపినట్టు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ శాఖలో 518 మందే ఉన్నారని గత భేటీలో, 1,105 మంది ఉన్నారని ఇప్పుడు చెప్పారు. స్థానికత విషయమై ఏ శాఖ నుంచీ పూర్తి సమాచారం లేదు. దిగువ స్థాయి కోర్టుల్లోని స్థానికేతరుల సమాచారం తెప్పించాలని నిర్దేశిస్తే అధికారులు స్పందించలేదు.

No comments: