Thursday, June 28, 2007

స్థానికేతరులు 4500 మంది - eenadu

స్థానికేతరులు 4500 మంది ప్రభుత్వానికి 99 శాఖల సమాచారం స్పందించని మూడు విభాగాలు జాబితాలపై తెలంగాణ సంఘాల అసంతృప్తి 75 నుంచి వివరాల సేకరణ కష్టమంటున్న అధికారులు నేటి నుంచి బదిలీలు హైదరాబాద్‌- న్యూస్‌టుడే610 అమల్లో భాగంగా ఇప్పటికి 99 శాఖలు స్థానికేతర ఉద్యోగుల్ని గుర్తించాయి. వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించాయి. గత శనివారం వరకు 63 శాఖలకు చెందిన 3,114 మందితో మాత్రమే జాబితా తయారు కావడం, దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడం తెలిసిందే. దీంతో సాధారణ పరిపాలన అధికారులు మిగతా అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఫలితంగా సోమవారం నుంచి బుధవారం వరకు, మరో 36 శాఖలు తమ పరిధిలోని సుమారు 1400 మంది ఉద్యోగుల వివరాలను పంపించాయి. వెరసి బుధవారం వరకు గుర్తించిన స్థానికేతరుల సంఖ్య సుమారు నాలుగున్నర వేలకు చేరింది. 610 అమలుకు గుర్తించిన మొత్తం 102 శాఖల్లో, దేవాదాయ, న్యాయ, భూ ఆక్రమణల కోర్టు విభాగాలు మాత్రమే ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం వరకు వాటి నుంచి కూడా సమాచారం అందుతుందని భావిస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖ నుంచి పూర్తి (కానిస్టేబుళ్లు, తదితరుల) వివరాలు అందలేదు. అక్కడ బదిలీల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో, ఒకటి రెండు రోజుల్లో సమగ్ర సమాచారం అందుతుందని చెబుతున్నారు. గుర్తించిన స్థానికేతరుల్లో స్వచ్ఛంద బదిలీ కోరుకునే వారికి, 28 నుంచి ఉత్తర్వులు అందజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు, గురువారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఉద్యోగుల పేర్లతోనే జీవోలివ్వాలని సాధారణ పరిపాలన అధికారులు అన్ని శాఖల వారికి నిర్దేశించారు. శాఖల వారీగా రెండేసి జీవోలు ఇస్తారు. పోస్టులు ఖాళీలున్న చోట్లకు బదిలీ చేస్తూ ఒకటి, పోస్టులు ఖాళీ లేని చోట్లకు డిప్యుటేషన్‌, కాల పరిమితితో బదిలీలతో మరోటి ఉంటాయి.
సర్కారు రూపొందించిన స్థానికేతరుల జాబితాపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఉద్యోగ నాయకుల్ని బుధవారం అత్యవసరంగా చర్చలకు పిలిచింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌, కార్యదర్శి గోపాల్‌రెడ్డి, గెజిడెట్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఉపాధ్యాయ సంఘం నేత ప్రభాకర్‌, ఇంజినీరింగ్‌ ఎక్సైజ్‌ సంఘాల శ్రీధర్‌ దేశ్‌పాండే, శ్రీనివాస్‌రావులతో సాధారణ పరిపాలన శాఖ సేవా విభాగం ముఖ్య కార్యదర్శి కృష్ణయ్య సమావేశమయ్యారు. ప్రభుత్వం తయారు చేసిన జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఉద్యోగులందరినీ సొంతజోన్లకు పంపాలని, డిప్యుటేషన్లన్నింటినీ రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. స్థానికేతర ఉద్యోగుల జాబితా తప్పులతడకగా ఉందని అభ్యంతరం తెలిపారు. వివాదాస్పద 415, 399 జీవోల ఆధారంగానే అది రూపొందిందని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని విమర్శించారు. ఎక్కువగా తెలంగాణా ఉద్యోగులనే స్థానికేతరులుగా గుర్తించారంటూ ఎక్సైజ్‌, ఇంజినీరింగ్‌ ఉద్యోగుల జాబితాలను ఉదహరించారు. ఈ జాబితాతో 610 అమలు సమస్యాత్మకంగా మారుతుందని, ఇది తెలంగాణా ఉద్యోగుల్లో చిచ్చు పెడుతుందని తెలిపారు. 1975 నుంచి జరిగిన నియామకాల ఆధారంగా స్థానికేతరులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నందున, తమకు అందుబాటులో ఉన్న సమాచారం జాబితా ఆధారంగా మొదటి దశ బదిలీలు చేపట్టామని కృష్ణయ్య తెలిపారు. 1975 నుంచి వివరాలు సేకరించడం కష్టసాధ్యమని ఆయా శాఖలు చెబుతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ నేతలు ఈ వాదనను తోసిపుచ్చారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, ఇతర బోర్డుల నుంచి సమాచారం సేకరిస్తే అన్ని వివరాలు సులభంగా అందుతాయని సూచించారు. (వారి అభ్యంతరాలను ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన కృష్ణయ్య, వెంటనే వెళ్లి ప్రధాన కార్యదర్శిని కలిశారు.) పరిమితికి లోబడి స్వచ్ఛంద బదిలీలపై వెళ్లేవారికే సీనియారిటీ వర్తిస్తుందని, ఇంకా ఎవరైనా వెళితే వారికి సీనియారిటీ వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం మరోదఫా చర్చలు జరిపి సలహాలు సేకరిస్తామని తెలిపారు. కాగా న్యాయ సలహా అవసరం లేకుండానే ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ నేతలు కోరారు.

No comments: