Thursday, June 28, 2007

మెత్తబడ్డ ఆంధ్రా ఎమ్మెల్యేలు! eenadu

రేపటి 610 సభాసంఘం భేటీకి హాజరు
సీఎం జోక్యం, పెద్దల సూచనలే కారణం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 సభాసంఘం నుంచి వైదొలిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మెత్తబడినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జోక్యంతో శనివారం జరిగే సభాసంఘం సమావేశంలో పాల్గొనాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అందులో సభ్యుడైన సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బి.వేదవ్యాస్‌ ధ్రువీకరించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కొనసాగడమే శ్రేయస్కరమని ముఖ్యమంత్రి వైఎస్‌, పార్టీ పెద్దలు చేసిన సూచనల మేరకు రాజీనామాలు చేసిన సభ్యులు మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజీనామాల ఉపసంహరణపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకున్నా ఎక్కువ మంది మాత్రం సీఎం, స్పీకరు సురేశ్‌రెడ్డిల సూచనలకు కట్టుబడి సభాసంఘంలో కొనసాగనున్నట్లు తెలిసింది. 610 జీవో అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పుడు సభాసంఘం నుంచి వైదొలగితే.. రాద్ధాంతం చేసేందుకు ఇతర పార్టీలకు అనవసరంగా అవకాశం కల్పించినట్లవుతుందని ముఖ్యమంత్రి వారితో అన్నట్లు తెలిసింది. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, సభాసంఘంలో కొనసాగాలని స్పీకరు కూడా కోరారు. రాజీనామాల ఉపసంహరణపై సభా సంఘంలోని ఏడుగురు కోస్తా, సీమ ఎమ్మెల్యేల్లో ఏకాభిప్రాయం లేనట్లు తెలిసింది. ఒకసారి వైదొలిగాక మళ్లీ కొనసాగడం ఎంతవరకూ సబబనే అభిప్రాయాన్ని ఒక ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉండడంతో సీనియర్‌ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి శనివారం జరిగే సమావేశంలో పాల్గొనే అవకాశంలేదు. -శనివారం సభా సంఘం సమావేశంలో తాను పాల్గొంటానని వేదవ్యాస్‌ తెలిపారు. కొందరు వ్యాఖ్యలతో మసస్తాపం చెంది వైదొలిగామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు లోబడి 610 జీవోను అమలు చేయాలనే అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, ఇదే అంశాన్ని సభాసంఘంలో కూడా పలుమార్లు చెప్పామని, మళ్లీ మళ్లీ అదే చెబుతామని తెలిపారు. తాము సభాసంఘంలో ఉండడం వల్లనే జీవో అమలు కావడంలేదని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశానికి హాజరై తమ వాదనా వినిపిస్తామన్నారు.

పోలీసుల బదిలీలపై ట్రైబ్యునల్‌ ఉత్తర్వుల పొడిగింపు
610 జీవో అమల్లో భాగంగా హైదరాబాద్‌లోని పోలీసుల్ని స్వస్థలాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన 'యథాపూర్వ స్థితి' ఉత్తర్వులను మరో 2వారాలపాటు పొడిగించారు. బదిలీలపై ఈనెల 16న వెలువడిన ఆదేశాలను సవాలు చేస్తూ వేణుగోపాల్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ట్రైబ్యునల్‌ యథాపూర్వ స్థితిని అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీనిపై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంతోపాటు, అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలకు వస్తారని, వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది.

No comments: