Tuesday, July 3, 2007

స్థానికేతరుల్లో సగం తెలంగాణ వారే ! eenadu

వివరాలు వెబ్‌సైట్లో పెడతాం
610పై పార్టీలది రాజకీయం
ఇష్టమొచ్చినట్టు పోస్టులివ్వలేం: సీఎం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
610 అమలుపై ఇప్పటివరకు జరిగిన కసరత్తు చాలా బాగుందని ముఖ్యమంత్రి వైఎస్‌ పేర్కొన్నారు. న్యాయబద్ధంగా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియను నిర్వహిస్తుండగా, కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. జీవోపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడారు. ''ఇప్పటి వరకు 124 జీవో ఆధారంగా 80 శాతం స్థానిక, 20 శాతం ఓపెన్‌ కోటా ప్రాతిపదికన స్థానికేతరుల నిర్ధారణ జరిగింది. దీని ప్రకారం 7089 మందిని గుర్తించాం. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ మేరకు, ఇక వెంటనే 1975 నుంచి గుర్తింపు ప్రక్రియ చేపడతాం. దీని ద్వారా స్థానికేతరుల సంఖ్య అయిదు నుంచి పది శాతం పెరగొచ్చు. స్థానికేతర ఉద్యోగుల సంఖ్య 50 వేలు, లక్ష, రెండు లక్షలు అని కొన్ని పార్టీలు చెబుతున్న దానిలో వాస్తవం లేదు. ఇప్పటికి హైదరాబాద్‌లో గుర్తించిన ఏడు వేల పైచిలుకు మందిలో సగం మంది తెలంగాణ జిల్లాల వారే. మిగిలిన సగం ఇతర ప్రాంతాల వారు. వీరందరి సమాచారం త్వరలో వెబ్‌సైట్‌లో పెడతాం'' అని ఆయన ప్రకటించారు. ''30 ఏళ్లుగా అమలుకాని ఈ జీవోను మేం చిత్తశుద్ధితో ఆచరణలోకి తెస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన కృషిని అన్ని పార్టీలు నిర్ద్వంద్వంగా అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల కన్నా ఎక్కువగా మేం దీని అమలుకు చర్యలు తీసుకున్నాం. 610 పరిధిలో లేనప్పటికీ కార్పొరేషన్లు, విశ్వ విద్యాలయాలకూ దీన్ని వర్తింపజేయాలని ఆదేశించాం'' అని ఆయన తెలిపారు. ''వాస్తవానికి ఈ జీవో అమలు జూన్‌ 30లోగానే ముగిసేది. అయితే ఉత్తర్వులపై వివాదాలు, ఇతర సమస్యల వల్ల జాప్యం జరిగింది. ఏ సమస్య అయినా ఉద్యోగ సంఘాలతో చర్చించి, పరిష్కరిస్తున్నాం. ఇక ఎవరూ ఏదీ అడగడానికి వీల్లేకుండా, తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేస్తున్నాం'' అని ఆయన వివరించారు. స్వచ్ఛందంగా వెళ్లేందుకు ముందుకొచ్చే వారందర్నీ ఎందుకు బదిలీకి అనుమతించడం లేదనే ప్రశ్నకు... ''అందరూ జిల్లాలకు వెళ్తే అక్కడ వారికోసం పోస్టులు సృష్టించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేపట్టలేదు. ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ పాటించకపోతే 6వేల కోట్ల రూపాయల కేంద్ర గ్రాంటు రాదు. ఇలాంటివన్నీ చూసుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నాం'' అని ఆయన వివరించారు.
వెంటనే ఉత్తర్వులు: పోలీసు శాఖలో స్థానికేతరులుగా గుర్తించిన వారిలో 2987 మంది కానిస్టేబుళ్లు, 175 ఎస్సైలు ఉన్నారని 610 మంత్రివర్గం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సభ్యుడు, హోంమంత్రి జానారెడ్డి విలేఖరులకు తెలిపారు. వీరిలో ఇప్పటికే 159 మంది కానిస్టేబుళ్లకు ఉత్తర్వులు అందాయని, మిగిలిన వారికి వెంటనే జారీ చేస్తున్నామని చెప్పారు. అంతమందిని ఒక్కసారిగా పంపిస్తే వినాయక చవితి, ఇతర పండుగల సమయంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున, బందోబస్తు అవసరాల కోసం, డిప్యుటేషన్‌పై కొనసాగించనున్నట్టు వెల్లడించారు. కొత్త నియామకాలు జరిగిన తర్వాత వీరి డిప్యుటేషన్లను రద్దు చేస్తామన్నారు. 610 అమలుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నామని, అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని జానారెడ్డి కోరారు. బదిలీ అయిన వారు వెళ్లబోమంటే కుదరదని, నిబంధనల మేరకు వెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు.

No comments: