Sunday, July 1, 2007

ఉద్యమంలోకి విద్యార్థులు eenadu

ప్రతి కళాశాలలో తెరాస కమిటీలు
తెలంగాణ భవన్లో ప్రత్యేక శిక్షణ
జిల్లాస్థాయి నేతలకు కేసీఆర్‌ నిర్దేశం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించాలని తెరాస పథక రచన చేస్తోంది. ఇందుకోసం ఒక విస్తృత కార్యాచరణను రూపొందించింది. ఆరేళ్ల తెరాస ప్రస్థానంలో విద్యార్థులు పూర్తిస్థాయిలో క్రియాశీల పాత్ర పోషించిన సందర్భాలేవీ లేవు. వారు ఉద్యమంలోకి వస్తే ఉద్రిక్త సమయాల్లో హింసాకాండ చెలరేగవచ్చనీ, దాన్ని అదుపు చేయడం కష్టమనే భావన అధినేత కేసీఆర్‌లో ఉందని ఆ పార్టీ వర్గాలంటాయి. కానీ గ్రామస్థాయిలో పట్టును పదిల పరుచుకుని, పట్టణ ప్రాంతాల్లో విస్తరించడానికి విద్యార్థి శక్తి అత్యవసరమని తెరాస అధినాయకత్వం ఇప్పుడు గట్టిగా విశ్వసిస్తోంది. తెలంగాణలోని ప్రతి కళాశాలలోనూ పార్టీకి బలమైన విద్యార్థి విభాగం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో తెరాస జిల్లాస్థాయి నేతలతో జరిపిన భేటీలో కేసీఆర్‌ ఈ మేరకు స్పష్టంగా నిర్దేశించారు. ఇంటర్‌ స్థాయి నుంచి ప్రతి కళాశాల ముందూ తెరాస పోస్టర్లుండాలని, పార్టీ జెండాను రెపరెపలాడించాలని వారికి సూచించారు. 'ఆరేళ్ల ఉద్యమంలో విద్యార్థుల పాత్రను మనం ఆశించలేదు. వారినెప్పుడూ తెరపైకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో వారి పాత్రను పెంచాల్సిన తరుణం వచ్చింది' అని ఆయన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జూనియర్‌ ఇంటర్‌ స్థాయి కళాశాలలోనూ పార్టీ కమిటీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారం రోజుల్లోఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. 'ప్రతి నాయకుడూ ప్రత్యక్షంగా కళాశాలకు వెళ్లాలి. 300 మంది విద్యార్థులుంటే 15 మందితో, అంతకు మించితే 24 మందితో కమిటీని ఏర్పాటు చేయాలి. వాటిల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 51 శాతం ఉండేలా జాగ్రత్త వహించాలి' అని సూచించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు తెలంగాణ భవన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రంగాల ప్రముఖులు వారికి వివరిస్తారు. అనంతరం ప్రతి విద్యార్థీ కొన్ని వందల మందిని చైతన్యపరచాలని నిర్దేశిస్తారు. కరీంనగర్‌ ఉప ఎన్నికలో తన విజయంలో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారని, ఆ సమయంలో వారి శక్తియుక్తులు ప్రస్ఫుటంగా కన్పించాయని ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో కళాకారులతో ధూంధాం కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం 50 సీట్లతో ఒక పెద్ద బస్సును ప్రత్యేకంగా తయారు చేయించారు. లంబాడీలను కూడా ధూంధాంలో భాగస్వాములను చేయాలని పార్టీ నేతలను అధినేత నిర్దేశించారు.

No comments: