Sunday, July 1, 2007

గుర్జర్లలా ఉద్యమిస్తాం: కేసీఆర్‌ eenadu

610పై కేసీఆర్‌
మావారిని అడ్డుకుంటారా?
ఇలాగైతే తెలంగాణ అగ్నిగుండమే
వైఎస్‌ మాడి మసవుతాడు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 610 జీవో అమలు కోరుతూ సచివాలయ ముట్టడికి పలు జిల్లాల నుంచి తరలి వస్తున్న తమ కార్యకర్తల్ని ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. వారందరినీ తక్షణం విడిచి పెట్టని పక్షంలో తెలంగాణ అగ్నిగుండమవుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణతో పెట్టుకుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ మాడి మసవక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరిపైనో దాడిచేసే ఉద్దేశంతో తామీ పిలుపివ్వలేదని స్పష్టం చేశారు. సచివాలయం, అసెంబ్లీల ముట్టడి ముందునుంచీ ఉన్నదేనని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి పెద్దసంఖ్యలో ముస్లిం మైనారిటీలు ఆదివారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఇక్కడి తెలంగాణభవన్లో వారినుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. బిందుసేద్యం కోసం జారీచేసిన జీవో 34ను 'యమడేంజర్‌ జీవో'గా ఆయన అభివర్ణించారు. దాన్ని తక్షణం రద్దుచేయని పక్షంలో రాజస్థాన్‌లో గుజ్జర్ల మాదిరిగా తెలంగాణ అంతటా రోడ్లను దిగ్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలనను పూర్తిగా స్తంభింపజేస్తామన్నారు. 'చిట్టచివరి స్థానికేతర ఉద్యోగిని కూడా తెలంగాణ నుంచి పంపేదాకా విశ్రమించేది లేదు. తెలంగాణలో ఆంధ్ర పెత్తందార్ల పెత్తనాన్ని ఇకపై సహించబోం. 50 ఏళ్లుగా వారు తెలంగాణను లూటీ చేసిందిచాలు. తెలంగాణలో భూకబ్జాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పైగా హైదరాబాద్‌ ఎవడబ్బ సొమ్మని ఆంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌ మా అబ్బ సొమ్మే. హైదరాబాద్‌ కోసం కిరికిరి చేయడానికి వారేమైనా మక్కా మసీదుకు పునాది తవ్వారా?'అని ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఐదారుగురు ముస్లిం మైనారిటీలకు మంత్రి పదవులతోపాటు 12 శాతం రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్పారు.

No comments: