Friday, December 28, 2007

ఎవరేమన్నా ఎదురీతే, Andhra jyothi, 29th Dec, 07

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (ఆన్‌లైన్‌): "అన్నా'' అంటే "నేనున్నా'' అంటూ అర్ధరాత్రి సైతం ప్రత్యక్షమయ్యే పబ్బతిరెడ్డి జనార్దన్‌రెడ్డికి హైదరాబాద్‌ బడుగు బస్తీ ప్రజలు గుండెలో గుడికట్టుకున్నా.... రాజకీయంగా మాత్రం ఆయనకు ఎదురీత తప్పలేదు. ఆరు నూరైనా అణుమాత్రం కదలని, పట్టువిడుపులు లేని మొండితనం కార్మిక నేతగా ట్రేడ్‌యూనియన్‌ వ్యవహారాలలో ఆయనను అగ్రస్థానంలో నిలిపినా రాజకీయాలలో ఒంటరిని చేసింది.
పార్టీ ఆయనకు ఊపిరి.. అయినా ఆయనకు షోకాజ్‌ నోటీసులు, సస్పెన్షన్‌ వంటి క్రమశిక్షణ చర్యలు తప్పలేదు. పార్టీ ఆవిర్భావ దినాన, పార్టీ కార్యకర్తల మధ్య, పార్టీ కార్యక్రమంలో తుదిశ్వాస విడిచిన పీజేఆర్‌ పార్టీలో మాత్రం కొరకరాని కొయ్యే... ఎందరికో పంటిలో రాయే. కొద్దినెలల క్రితం క్రమశిక్షణలో భాగంగా పార్టీ అధిష్ఠానం జారీ చేసిన ఒక షోకాజ్‌ నోటీసుకు ఆయన ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉండడం విశేషం.
చర్యలపై చరిష్మాదే పైచేయి1989 ఎన్నికల ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పీజేఆర్‌ బహిరంగ పోరాటం చేశారు. ఎన్నికల ముందు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదే తీరులో 2004 ఎన్నికలకు కొంతకాలం ముందు ఎం.సత్యనారాయణరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వాయలార్‌ రవి ఆయనను సస్పెండ్‌ చేశారు. తాజాగా.. కొద్దినెలల క్రితం దిగ్విజయ్‌సింగ్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయితే ఆయనపై ఏ క్రమశిక్షణ చర్యనూ హైకమాండ్‌ ఎంతో కాలం కొనసాగించలేదు. అ ప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డిలతో ఆయన సర్దుకుపోలేక పో యారు.
పార్టీ రాజకీయాలలో టి.అంజయ్య అడుగుజాడ ల్లో నడిచిన పీజేఆర్‌ ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని అనుసరించారు. తర్వాతి రోజులలో నేదురుమల్లి పట్ల కూడా చాలా రోజులు కినుకవహించి అంటీ అంటకుండా తిరిగినా.. ఇటీవల మళ్లీ సన్నిహితమయ్యారు. రాజకీయం గా సమకాలికుడు.. తనతోపాటు తొలిసారి మంత్రి అయిన వైఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఒక దశలో పీజేఆర్‌ ప్రయ త్నించినా అది ఎంతో కాలం కొనసాగలేదు. 1999 ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న దశలో వైఎస్‌ను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. ఢిల్లీ నుంచి వస్తున్న వైఎస్‌కు స్వాగతంపలకటానికి విమానాశ్రయానికి వెళ్లాలా, వద్దా అని ఆయన రెండు రోజులు మథనపడ్డారు. అప్పటికి నాలుగు సంవత్సరాలుగా సీఎల్పీ నేతగా ఉన్న పీజేఆర్‌ అధికార తెలుగుదేశం పార్టీపై గట్టిపోరాటం చేస్తున్నారు.
పార్టీ అతి బలహీనమైన దశలో ఉన్న ఆ కాలంలో పీజేఆర్‌ పోరాట ధోరణి కారణంగానే కాంగ్రెస్‌ ప్రజలలో నానుతుండేది. ఒకటి రెండు సార్లు వైఎస్‌ సన్నిహితుల నుంచి పిలుపు రావటంతో తప్పని పరిస్థితిలో ఆయన వైఎస్‌కు స్వాగతం పలకడానికి వెళ్లి... టాపులేని కారులో వెంట వచ్చారు. అయితే ఈ నిర్ణయంపై అనతికాలంలోనే పశ్చాత్తాపపడ్డారు. "తప్పు చేశా. విమానాశ్రయానికి వెళ్లకుండా ఉండాల్సింది. గాంధీభవన్‌కు వెళ్లి కలిసి వచ్చివుంటే సరిపోయేది'' అని ఆ తర్వాత పదేపదే అనుకున్నారు. పార్టీలోని రెండు కీలక పదవులలో ఇద్దరూ ఉండటంతో ఎంతోకాలం సర్దుకుపోలేకపోయారు. ఎన్నికల నాటికి వారి మధ్య వైరం మరింతపెరిగింది. టిక్కెట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం కుదరక రోజుల తరబడి గొడవపడ్డారు.
సీఎల్పీ నాయకత్వం అరుదైన మలుపుపీజేఆర్‌కు అనుకోని అరుదైన అవకాశం కోట్ల విజయభా స్కరరెడ్డి హయాంలో 1994లో వచ్చింది. నిజానికి అదే ఆయనను రాజకీయంగా దెబ్బ కూడా కొట్టింది. 1994 ఎన్నికల నాటికి తన మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన పీజేఆర్‌ను కోట్ల అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా దగ్గరకు తీశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతిని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 26 మంది సభ్యులు మాత్రమే ఉన్న అప్పటి సీఎల్పీకి నాయకత్వం వహించలేని,వైఎస్‌ వర్గానికి పదవి ఇవ్వటం ఇష్టం లేని కోట్ల... పీజేఆర్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. ఇది ఆయన స్థాయిని పెంచింది.. సమస్యలూ పెంచింది.
ఏకపక్షంగా తెలుగుదేశం వెలిగిపోతున్న కాలం.. కొమ్ములు తిరిగిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలందరూ పరాజయంతో ఇంట్లో కూర్చున్న రోజులు. అసెంబ్లీలో 220 పైగా సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీతో పోరాడాల్సిన పనిని పీజేఆర్‌ భుజానికెత్తుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించారు. వాక్‌చాతుర్యంతో పని లేదనుకొని న మ్మినదానికి కట్టుబడి మొండిగా పోరాడారు. ఆల్‌మట్టి వంటి అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే సీఎల్‌పీలో కనీసం సగంమంది సహకారం కూడా లభించలేదు.
నలుగురైదుగురిని వెంటపెట్టుకున్నా ఆయనది దాదాపు ఒంటరి పోరాటంగానే మారింది."పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఈ విజయంలో సీఎల్‌పీ పాత్రను మరిచిపోకూడదు..'' అని 1999 ఎన్నికల ఫలితాలకు ముందు సోనియాను కలిసి చెప్పి వచ్చిన పీజేఆర్‌ తన కంచుకోట ఖైరతాబాద్‌తో పరాజయం పాలయ్యారు. దీంతో ఆయన తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. దీనికి తోడు 1998 నుంచి.. దాదాపు దశాబ్దకాలంగా రాష్ట్ర పార్టీలో వైఎస్‌ ప్రాబల్యం అధికమైంది.
కష్టకాలంలో సీఎల్‌పీకి నాయకత్వం వహించిన పీజేఆర్‌.. ఆ స్థాయిని కాపాడుకుంటూ పోరాటపంథాలో కొనసాగాల్సి వచ్చింది. అయిదు సంవత్సరాల విరామం తర్వాత 2004లో పార్టీకి అధికారం దక్కినా ఆయనకు మాత్రం పదవి దక్కలేదు. ఏకపక్షంగా సాగుతున్న వైఎస్‌ ధోరణికి ఎక్కడికక్కడ అడ్డుకట్టవేయాలని ఆయన గట్టి ప్రయత్నం చేశారు. పార్టీలోని పెద్ద నాయకులు సైతం రాజీపడినా పీజేఆర్‌ మాత్రం తిరుగుబాటు బవుటా ఎగవేశారు.
నిత్య విద్యార్థిఏదైనా సాంకేతిక అంశంపై మాట్లాడటానికి ముందు దాని గురించి అనుభవజ్ఞులైన సాం కేతిక నిపుణులతో మాట్లాడి అవగాహన చేసుకున్న తర్వాతే అసెంబ్లీలో కానీ, పార్టీ వేదికలపై కానీ, ఇతర వేదికలపై కానీ ఆయన మాట్లాడేవారు. తెలియని విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస పీజేఆర్‌లో అపారంగా ఉండటం వల్లే ఎన్నో విషయాలను సులువుగా అర్ధం చేసుకునే వారని పాలి టెక్నిక్‌ చదివే రోజుల్లో ఆయనకు విద్య బోధించిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ జి.ప్రభాకర్‌ 'ఆన్‌లైన్‌'కు తెలిపారు.

No comments: