Friday, December 28, 2007

ఇద్దరినీ ఇరుకున పెట్టిన ఘనుడు.. పీజేఆర్‌, Andhra Jyothi, 29th Dec, 07

కేవలం 26 మంది ఎమ్మెల్యేలతో 1994-99 మధ్య కాలంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా వ్యవహ రించిన పీజేఆర్‌ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆల్మట్టి డ్యాం, ఏలేరు స్కాం, కాల్దరి కాల్పులు వంటి పలు అంశాలపై ముప్పతిప్పలు పెట్టారు. 2004 నుంచి నేటి వరకు శ్రీశైలం రిజర్వాయర్‌ కనీస నిల్వ మట్టం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, జంట నగరాలకు మూడో దశ కృష్ణా జలాల తరలింపు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌, ఔటర్‌రింగ్‌ రోడ్డు భూ సేకరణ అక్రమాలు, డీబీఆర్‌ మిల్స్‌ భూముల కేటా యింపు వంటి అంశాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డికి నిద్ర లేకుండా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్‌ అయినా, పార్టీ కేంద్ర నాయకత్వం కన్నెర్ర చేసినా ప్రజా సమస్యలపై మడమ తిప్పని పోరాటం చేయడం పీజేఆర్‌ నైజం.
రాజధానికి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ గురించి అవగాహన సహజంగానే ఉండదు. పీజేఆర్‌ మాత్రం ఆ కోవలోకి రారు. నాటి ఆల్మట్టి డ్యాం నుంచి నేటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వరకు రాష్ట్రంలో ఏ ప్రాంత, ఏ పార్టీ నాయకుడు పోరు సలపనంతగా పీజేఆర్‌ జరిపారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలనే సలహాలు రాష్ట్ర, కేంద్ర పార్టీ నాయకత్వాల నుంచి, మిత్రుల నుంచి వచ్చినా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల గురించి పోరాటం చేయకుండా ఉండలేని బలహీనత పీజేఆర్‌ది అని ఆయన సన్నిహితులు చెప్పారు.

No comments: